సెప్టెంబరు 1 నుంచి నాణ్యమైన బియ్యం డోర్‌ డెలివరీ..!

ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన సీఎం వైయస్‌.జగన్ సెప్టెంబరు 1నుంచి నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటికే డోర్‌ డెలివరీ చేయాలని అధికారులను ఆదేశించారు. అదే రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పధకాన్ని అమల్లోకి తీసుకు రావాలని స్పష్టం చేశారు. కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సమీక్షల్లో భాగంగా పౌరసరఫరాల శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. సీఎం ఆదేశాలతో నాణ్యమైన బియ్యం రాష్ట్రవ్యాప్తంగా డోర్‌ డెలివరీ చేయడానికి పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతోంది. 

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపంపిణీ వ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజలకు బియ్యం నాణ్యతపైన కూడా ప్రత్యేక దృష్టిపెట్టింది. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం తినలేని విధంగా ఉండడంతో  ఆ బియ్యాన్ని దళారులకు అమ్ముకునేవారు. మళ్లీ ఆ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి మరలా మార్కెట్లోకి తీసుకు వచ్చేవారు. దీంతో పేదలకు నాణ్యమైన బియ్యం అందించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇందులో భాగంగానే తాజా ఆదేశాలు ఇచ్చారు. 

డోర్ డెలీవరీ ఇలా చేస్తారు..

లబ్ధిదారులకు పారదర్శక పద్ధతిలో, అవినీతికి తావులేకుండా, నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గోడౌన్ల నుంచి వచ్చే ప్రతి గన్నీ బ్యాగుపై కూడా స్ట్రిప్‌ సీల్‌ ఉంటుంది. అలాగే ప్రతి బ్యాగుపైనా బార్‌ కోడ్‌ ఉంటుంది. కల్తీలేకుండా, రవాణాలో అక్రమాలు జరక్కుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉండేలా 13,370 మొబైల్‌ యూనిట్లను పెడుతున్నారు. 

 ఇందులోనే ఎలక్ట్రానిక్‌ వేయింగ్‌ మెషిన్‌ ఉంటుంది. ఈ మొబైల్‌ యూనిట్ల ద్వారా ప్రతి లబ్దిదారుని ఇంటికివెళ్లి బియ్యాన్ని డోర్‌ డెలివరీ చేస్తారు.  లబ్ధిదారుల ముందే బియ్యం బస్తా సీల్‌ను ఓపెన్‌ చేసి వారికి నిర్దేశించిన కోటా ప్రకారం బియ్యాన్ని అందిస్తారు. బియ్యాన్ని తీసుకోవడం కోసం లబ్ధిదారునికి నాణ్యమైన సంచులను ఉచితంగా అందిస్తారు. ప్రతి నెలా 2.3 లక్షల మెట్రిక్‌ టన్నుల నాణ్యమైన బియ్యాన్ని డోర్‌డెలివరీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. 

Leave a Comment