ఆ తల్లి ఫోన్ కాల్.. 25 మంది ప్రాణాలు కాపాడింది..

ఉత్తరాఖండ్ లో ధౌలిగంగా వరద తీరని విషాదాన్ని నింపింది. ఈ విషాదంలో ఇప్పటి వరకు 40 మందికిపైగా మరణించారు. ఇంకా వంద మందికి పైగా జాడ తెలియడం లేదు. అయితే ఓ తల్లి తన కొడుకు ప్రాణాల కోసం పడిన తపన మరో 24 మంది ప్రాణాలు కాపాడింది. పదేపదే ఫోన్ చేస్తూ అతడ్ని హెచ్చరించడంతో అతనితో పాటు మరో 24 మంది అతని సహచరులు ప్రాణాలతో బయటపడ్డారు. 

ఎన్టీపీసీ జల విద్యుత్ కేంద్రంలో విపుల్ కైరేనీ అనే 27 ఏళ్ల వ్యక్తి ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో అతడు తన ఊరి నుంచి ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్లాడు. అయితే వెళ్లిన కాసేపటికే ధౌలిగంగ ఉగ్రరూపం దాల్చింది. విపుల్ ఊరు చాలా ఎత్తున ఉంటుంది. దీంతో ఆ సమయంలో ఇంటి బయట పనిచేస్తున్న అతని తల్లి మంగశ్రీ దేవి ముందుగానే ధౌలిగంగ ఉగ్రరూపాన్ని చూసింది.

ఆ వెంటనే తన కొడుకుకు ఫోన్ చేసింది. ఆమె హెచ్చరికను విపుల్ తేలిగ్గా తీసుకున్నాడు. అయితే ఆమె పదే పదే ఫోన్ చేయడంతో తన సహచరులతో కలిసి విపుల్ ప్రాజెక్ట్ మెట్లపైకి ఎక్కినట్లు విపుల్ చెప్పాడు. దీంతో అతనితో పాటు మరో 24 మంది ప్రాణాలతో బయటపడ్డారు. 

Leave a Comment