ముంచుకొస్తున్న థర్డ్ వేవ్ ముప్పు.. జనవరి-ఏప్రిల్ మధ్యలో తారాస్థాయికి..!

కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో ప్రజా జీవనం అతలాకుతలమైంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది, భారత్ లో 4.5 లక్షల మంది ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ సరఫరా లేక ఎంతో మంది చనిపోయారు. ఇప్పుడిప్పుడే సెకండ్ వేవ్ నుంచి ప్రజలు కోలుకుంటున్నారు. మార్కెట్లలో తిరిగి సందడి నెలకొంటోంది. ఈక్రమంలో కరోనా థర్డ్ వేవ్ పై తాజా అధ్యయనం షాకింగ్ విషయం వెల్లడించింది. 

కరోనా థర్డ్ వేవ్ అక్టోబర్ నెలలోనే మొదలయ్యే అవకాశం ఉందని, వచ్చే ఏడాది జనవరి-ఏప్రిల్ మధ్యలో ఇది తారాస్థాయికి చేరుకుంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. వ్యాపార, వినోద కార్యకలాపాలు ఊపందుకోవడం, సామాజిక, రాజకీయ, మత కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం వైరస్ కు కొత్త కోరలు తొడిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నామన్న భావనలో కోవిడ్ మార్గదర్శకాలను మరిచిపోతున్నారు. నిబంధనలను అతిక్రమించకుండా ప్రభుత్వం కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

కరోనా థర్డ్ వేవ్ విలయతాండవం చేయకుండా దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత వేగవంతంగా చేయాల్సిన అవసరం ఉంది.. ఇప్పటి వరకు దేశంలో 70 శాతం వయోజనులకు ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 25 శాతం మంది రెండు డోసులు తీసుకున్నవారు ఉన్నారని పేర్కొంది. కరోనా థర్డ్ వేవ్ ముప్పును నివారించాలంటే ఈ ఏడాదికల్లా జనాభాలో 60 శాతానికి పూర్తిస్థాయి టీకా రక్షణ లభించాలని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు వ్యాక్సిన్ మైత్రిలో భాగంగా ఇతర దేశాలకు టీకాల వితరణను పున:ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. అయితే దేశీయ అవసరాలకు విఘాతం కలగకుండా టీకా దౌత్యాన్ని ఫలవంతం చేేసే కార్యాచరణ ప్రణాళికను కేంద్రప్రభుత్వం చేపట్టాలి. చిన్నారుల టీకాలపై ప్రయోగాలను వేగవంతం చేసి వినియోగంలోకి తీసుకురావాలి. అంతేకాదు కరోనా కట్టడిలో నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు చేపట్టాలి. అప్పుడే వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కోగలము.. 

Leave a Comment