పెట్రోల్ బంకుల్లో ‘చిప్’ పెట్టి.. ఎంత మోసం చేస్తున్నారో తెలుసా?

మీరు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టిస్తున్నారా? మీ బండికి మైలేజ్ రావడం లేదా..అయితే మీరు మోసపోయినట్లే.. ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్ బంకుల్లో నయాదందా మొదలైంది. మైక్రో చిప్స్ తో కస్టమర్లను మోసం చేస్తున్నారు. ఈ సీక్రెట్ చిప్ వల్ల మీటర్ లో మనకు కరెక్టుగానే పెట్రోల్ పోసినట్లు కనిపిస్తుంది. కానీ లీటర్ పెట్రోల్ కొట్టిస్తే.. 30 ఎంఎల్ నుంచి 50 ఎంఎల్ వరకు తక్కువ వస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో పెట్రోల్ దోపిడీకి పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 

ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో మొత్తంగా 34 పెట్రోల్ బంకుల్లో మైక్రో చిప్స్ పెట్టి మోసాలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. పెట్రోల్ బంక్ యజమానులతో కలిసి ఈ ముఠా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కొందరు వాహనాదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో అప్రమత్తమైన సైబరాబాద్ ఎస్వోటీ, మేడ్చల్, జీడిమెట్ల పోలీసులు నిఘా పెట్టి ఘరనా మోసగాళ్ల ముఠాను పట్టుకున్నారు. 

బాలనగర్ డీసీపీ పద్మజ చెప్పిన వివరాల ప్రకారం.. తెలంగాణ, ఏపీ, కర్ణాటకలో పెట్రోల్ బంకుల్లో ముఠా మోసాలకు పాల్పడుతోంది. సాఫ్ట్ వేర్ రూపొందించి తక్కువ పెట్రోల్ వచ్చేలా మోసాలు చేస్తున్నారు. 34 పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. నిందితులు గతంలో పెట్రోల్ బంకుల్లో పనిచేసినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. జగద్దిరిగుట్టకు చెందిన ఫైజల్ బారీ, సందీప్, అస్లం, నర్సింగ్ రావు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. 

గతంలో పెట్రోల్ బంకుల్లో పనిచేయడంతో వీరికి చిప్స్ అమర్చి ఎలా మోసం చేయాలో అవగాహన ఉంది. జీడిమెట్ల మైలార్ దేవ్ పల్లి, జవహర్ నగర్, మేడిపల్లి, ఖమ్మం, వనపర్తి, మహబూబ్ నగర్, నెల్లూరు, సూర్యపేట, సిద్ధిపేట, తదితర ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడ్డారు. ఈ ముఠాతో పాటు పెట్రోల్ బంకుల యజమానులు వంశీధర్ రెడ్డి, రమేష్, మహేశ్వర్ రావు, వెంకటేష్ లను అరెస్టు చేశారు. వీరిపై వద్ద నుంచి 6 ద్విచక్రవాహనాలు, రెండు కార్లు, ఎలక్ట్రానిక్ చిప్స్, మథర్ బోర్డులు పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. పెట్రోల్ బంకుల్లో మోసాలు జరుగుతున్నట్లు వాహనదారులకు అనుమానం వస్తే వెంటనే పోలీసులను, తూనికలు కొలతల శాఖ అధికారులను సంప్రదించాలని డీసీపీ పద్మజ తెలిపారు. 

ఎలా మోసం చేస్తారంటే..

పెట్రోల్ ఫిల్లింగ్ బాక్స్ మీటర్ బోర్డు వెనుక భాగంలో మథర్ బోర్డులో మైక్రో చిప్ ను ఫిక్స్ చేస్తారు. దీనికి డిస్ ప్లే బోర్డులోని డిజిటల్ నంబర్లు రీడింగ్ కు కనెక్ట్ చేస్తారు. కరెక్ట్ రీడింగ్ చూపిస్తూ తక్కువ పెట్రోల్ డెలివరీ అయ్యే విధంగా ఈ మైక్రో చిప్ వర్క్ చేస్తుంది. ప్రతి బంకులో సుమారు నాలుగు ఫిల్లింగ్ మిషన్లు ఉంటే.. రెండు మిషన్లను ఇలా ట్యాంపరింగ్ చేస్తారు. చిప్ ఏర్పాటుతో లీటర్ కు 30-50 మిల్లీ లీటర్ల పెట్రోల్ తక్కువగా వస్తుంది. తెలంగాణలో 6 పెట్రోల్ బంకుల్లో మోసాలు చేశారు. ఏపీ, కర్ణాటకలో 28 బంకుల్లో మోసాలకు పాల్పడ్డారు.   

 

Leave a Comment