‘కట్నంతో ఎన్నో లాభాలు’.. వివాదాస్పదంగా పుస్తకంలో పాఠం..!

వరకట్నం తీసుకోవడం దేశంలో నిషేధం.. అయినప్పటికీ వరకట్న సమస్య వెంటాడుతూనే ఉంది. వరకట్న వేధింపులు తట్టుకోలేక ఎంతో మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. దేశంలో వరకట్నం నిషేధం ఉన్నప్పటికీ.. చట్టాలు అమలులో లోపాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు..

అయితే ఓ పుస్తకంలో మాత్రం వరకట్నంతో ప్రయోజనాలు ఉన్నాయంటూ రాశారు.. బీఎస్సీ నర్సింగ్ రెండో ఏడాది పుస్తకం ‘సోషియాలజీ ఫర్ నర్సింగ్’లో ఒక పేరాలో వరకట్నం ప్రయోజనాల గురించి వివరించారు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశమైంది. పుస్తకంలోని ఆ పేజీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో.. ఈ వ్యవహారంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 

టీకే ఇంద్రాణి రచించిన సోషియాలజీ ఫర్ నర్సింగ్ పుస్తకంలో ‘మెరిట్స్ ఆఫ్ డౌరీ’ అంటూ ఓ పేజీలో రాసుకొచ్చారు. అంతేకాదు భారత నర్సింగ్ కౌన్సిలింగ్ సిలబస్ ఆధారంగానే పుస్తకాన్ని రూపొందించినట్లు అందులో రాసి ఉంది. మరి పుస్తకంలో ఏమున్నాయో ఒకసారి చూద్దాం.. 

వరకట్నంతో ప్రయోజనాలు:

  • కొత్త కుటుంబాన్ని, ఇంటిని ఏర్పాటు చేసుకోవానికి వరకట్నం ఉపయోగపడుతుంది. ఇంట్లోకి సమస్త సామగ్రి, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫర్నీచర్ వస్తాయి. 
  • అమ్మాయికి తల్లిదండ్రుల ఆస్తి కట్నం రూపంలో అందుతుంది. 
  • కట్నాలు ఇచ్చే స్తోమత లేక కొందరు తల్లిదండ్రులు అమ్మాయిలను చదివిస్తున్నారు. వారు చదివి, ఉద్యోగంలో చేరితే కట్నం డిమాండ్ తగ్గుతుంది. ఇది మంచి ప్రయోజనం..
  • అందంగా లేని అమ్మాయిల కోసం వారి తల్లిదండ్రులు వరకట్నం ఇచ్చి పెళ్లి జరిపించవచ్చు.

ఇలా పలు వ్యాఖ్యానాలు ఆ పుస్తకంలో ఉన్నాయి. ఈ వ్యవహారంపై నెటిజన్లు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి పుస్తకాల్లో పెట్టి విద్యార్థులకు ఏం నేర్పిద్దామని అనుకుంటున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి పుస్తకాల్లో ఉండటం మన భారతజాతికే సిగ్గుచేటు అన్నారు. వెంటనే వాటిని తొలగించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కోరారు. 

 

Leave a Comment