మంటల్లో చిక్కుకున్న చిన్నారిని రక్షించిన కానిస్టేబుల్..!

రాజస్థాన్ కరౌలీలో ఓ కానిస్టేబుల్ సాహసం చేశాడు.. మంటల్లో చిక్కుకున్న ప్రాంతం నుంచి ఓ పసికందును సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. కానిస్టేబుల్ ఆ పసికందును తన చేతుల్లో పట్టుకుని కరౌలీలోని ఇరుకైన సందుల గుండా పరుగెత్తాడు. కానిస్టేబుల్ సాహసం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

రాజస్థాన్ లోని కరౌలీలో శనివారం మత ఘర్షణలు జరిగాయి. కొత్త సంవత్సరం రోజు ర్యాలీ సందర్భంగా కొందరు రాళ్లు రువ్వడంతో ఘర్షణ మొదలైంది. ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న నేత్రేష్ శర్మ అనే కానిస్టేబుల్ గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అంతేకాదు నిప్పు అంటుకున్న రెండు షాపుల మధ్య ఇంటి నుంచి మహిళను, ఆమె చంటి బిడ్డను కానిస్టేబుల్ ఆదుకున్నాడు. 

కానిస్టేబుల్ నేత్రేష్ చూపిన తెగువకు రాజస్థాన్ పోలీస్ శాఖ గర్వంగా భావిస్తోంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా కానిస్టేబుల్ తో ఫోన్ లో మాట్లాడారు. అతడిని హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన నేత్రేష్ అది తన బాధ్యత అంటూ చెప్పాడు.

కాగా, కరౌలీలోని ప్రధాన మార్కెట్ లోని ఫుటా కోట్ ప్రాంతంలో ఊరేగింపు సందర్భంగా రాళ్ల దాడి జరగడంతో పోలీసులు సత్వరమే స్పందించి 46 మందిని అరెస్ట్ చేశారు. రాళ్లు రువ్విన ఘటనకు సంబంధించి 7 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 21 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ఈ ఘర్షణలపై ముఖ్యమంత్రి గెహ్లాట్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. రాజస్థాన్ లో జరిగిన మత ఘర్షణలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఏ మతమైన మంచిని ప్రచారం చేయాలన్నారు. కానీ డీజే వాయిస్తూ.. ఊరేగింపులో నినాదాలు చేయడంతో అశాంతి వ్యాపించి.. సంఘవిద్రోహులు అల్లర్లకు దారి తీశారననారు. దేశంలో హింస, అల్లర్లను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. 

   

 

  

 

 

Leave a Comment