సీఏఏపై ఐరాసకు ‘ది అసోం సోంగ్రామి మాంచా’ ఫిర్యాదు

గుహవటి : కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన వివాదస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఇటీవల ఆవిర్భవించిన అసోంకు చెందిన ది అసోం సోంగ్రామి మాంచా అనే రాజకీయ పార్టీ ఐక్యరాజ్యసమితి తలుపు తట్టింది. అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనలకు అనుగుణంగా ఈ చట్టం యొక్క ప్రామాణికతపై దృష్టి పెట్టాలని కోరింది. సీఏఏ ద్వారా చొరబాటుదారులకు పౌరసత్వం కల్పించడం ద్వారా ఈశాన్య భారత సామాజిక ఆర్థిక స్థితిగతులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ మేరకు ఆ పార్టీకి చెందిన నేతలు ఈనెల 5న జెనీవాలోని యుఎన్ మానవ హక్కుల హైకమిషనర్ కు, భారత్ లోని ప్రతినిధికి, యుఎన్ కు చెందిన సెక్రటేరియన్ ఆఫ్ ది పర్మనెంట్ ఫోరం ఆన్ ఇండీజినియస్ ఇస్యూస్ (ఎస్పీఎఫ్ఐఐ) చైర్ పర్సన్ కు వేర్వేరుగా లేఖలు పంపారు. సీఏఏ కారణంగా ఈశాన్య భారతంలో ప్రధానంగా అసోం ప్రజలు గుర్తింపునకు, స్థిరత్వానికి తీవ్ర భంగం వాటిల్లే ప్రమాదం ఉందని పార్టీ అధ్యక్షుడు దిగాంత కొన్వార్, వర్కింగ్ ప్రెసిడెంట్ అదీప్ కుమార్, ఇతర నేతలు ఐరాస దృష్టికి తీసుకొచ్చారు.

ఎటువంటి మత వివక్ష లేకుండా శరణార్థులకు సర్టిఫికెట్ ఇవ్వాలని యుఎన్ హెచ్ సీఆర్ నిబంధనలు చెబుతున్నాయని, అయితే సీఏఏ ఆ విధంగా లేదని పేర్కొన్నారు. మానవ హక్కులకు సంబంధించి ఐరాస తీసుకొచ్చిన యూనివర్సల్ డిక్లరేషన్ కు భారత్ కూడా ఆమోదం తెలిపిందని, అయితే ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ మత వివక్ష పాటించేదిగా ఉందని, ఇది పూర్తిగా భారత రాజ్యాంగంతో పాటు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని తమ పిటిషన్ లో పేర్కొన్నారు.

Leave a Comment