ఐటీ ఉద్యోగం వదిలేసి వ్యవసాయం క్షేత్రంలోకి తెలంగాణ యువతి..!

ఆమె చదివింది కంప్యూటర్ ఇంజినీరింగ్.. ఓ కార్పొరేట్ సంస్థలో బిజినెస్ ఎనలిస్ట్ గా ఉద్యోగం.. కానీ నగర జీవితంలోని కాలుష్యం, రసాయనాలలో ముంచి తేల్చిన ఆహారం ఆమెకు నచ్చలేదు. ఉరుకులు పరుగుల జీవితమంటేనే అసహ్యం కలిగింది. అందుకే ఆ జీవితం వద్దనుకుని వ్యవసాయంలో రాణిస్తోంది.. ఆమెనే ఆదిలాబాద్ జిల్లాకి చెందిన సాయి చిన్మయి.. 

చిన్మయి తల్లిదండ్రులు మోహన్ రెడ్డి, సుజాతలకు ఇచ్చోడ శివారులో ఆరు ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోట ఉంది. కరోనా సంక్షోభంలో చిన్మయి తన తోటలో కూర్చుని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేది. తీరిక ఉన్నప్పుడు పొలం పనులు పర్యవేక్షించడం చేసేది. అలా వ్యవసాయం మీద ఆమెకు మక్కువ పెరిగింది. వ్యవసాయానికి అనుబంధంగా కూరగాయలు, పండ్లు, పూలు సేంద్రిప పద్ధతిలో సాగు చేయాలని అనుకుంది. అందుకు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు.. అంతే వెంటనే రంగంలోకి దిగింది. 

ఏం పండిస్తుందంటే?

మామిడి తోటలో వరుసులకు మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది. ఆ స్థలంలో పండ్లు, పూలు, ఔషధ మొక్కలు పెంచాలని చిన్మయి నిర్ణయించుకుంది. అంతర్ పంటలుగా ఎరుపు, గ్రీన్ ఆపిల్, జామ, సీతాఫలం, బొప్పాయి, అల్లనేరేడు, సంత్రా వంటి పండ్లు.. గులాబి, చామంతి, పారిజాతం, తులసి, నంది వర్ధనం, బంతి, జాజి, విరజాజి, బొకే గులాబి, నాగపడగ, డచ్ రోజెస్ వంటి పూలు.. పాలకూర, చెలిమెటి, పుంటి, మెంతి, కొత్తిమీర వంటి ఆకుకూరలు.. టమాట, వంకాయ, బెండ, చిక్కుడు లాంటి కూరగాయలు సాగు చేస్తోంది. అంతేకాదు దాల్చిన చెక్కతో పాటు 10 రకాల మసాల దినుసుల మొక్కలు కూడా ఉన్నాయి. మొత్తంగా 80 రకాల పూలు, పండ్ల మొక్కలు సాగు చేస్తున్నది. ఇక మామిడి చెట్లకు తేనెటీగలు తుట్టెలు పెడుతున్నాయి. 

ఇక తన వ్యవసాయ క్షేత్రంలో రెండు మేలు రకం జెర్సీ ఆవులను తెప్పించింది. ఇంకా కుందేళ్లు, బాతులు, కోళ్ల పెంపకం కూడా చేపట్టింది. గుడ్లను సహజ పద్ధితిలో, ఇన్ క్యుబేటర్ ద్వారా పొదిగిస్తున్నారు. కుందేళ్లు, కోళ్లకు ఇక్కడే దాణా కూడా తయారు చేస్తున్నారు. ఆవులు, కోళ్ల పెంటను సేంద్రియ ఎరువుగా వాడుతున్నారు. పాముల బెడద లేకుండా రాజహంసలను పోషిస్తున్నారు. భవిష్యత్తులో గొర్రెల పెంపకం కూడా చేపడతామని చిన్మయి చెబుతోంది..  

Leave a Comment