ఆ విమానంలో ముగ్గురే ప్రయాణికులు..!

హైదరాబాద్ నుంచి షార్జాకు విమానంలో కేవలం ముగ్గురు మాత్రమే ప్రయాణం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏకంగా 180 మంది ప్రయాణికులు ఒకేసారి ప్రయాణం చేసే వీలున్న విమానంలో కేవలం ముగ్గురు.. అది కూడా ఒకే ఫ్యామిలీ ప్రయాణం చేసింది. 

అయితే ఆ విమానాన్ని ఆ ఫ్యామిలీ బుక్ చేసుకుందేమో అనుకుంటే పొరపాటే.. ఎలాంటి అదనపు ఖర్చులు చెల్లించకుండా ఈ సౌకర్యం తెలంగాణకు చెందిన ఓ ఎన్ఆర్ఐ ఫ్యామిలీకి లభించింది. వివరాల మేరకు కరీంనగర్ కు చెందిన బండం శ్రీనివాసరెడ్డి, పోటు హరితరెడ్డి దంపతులు పదేళ్లుగా దుబాయ్ లో నివాసముంటున్నారు. 

హరితరెడ్డి ఓ ఆస్పత్రిలో డాక్టర్ కాగా, శ్రీనివాసరెడ్డి టెక్ మహేంద్ర కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు. ఏప్రిల్ 18న హరిత రెడ్డి తండ్రి సత్యనారాయణ రెడ్డి మరణించారు. దీంతో ఈ దంపతులిద్దరూ కొడుకు సంజిత్ రెడ్డితో అదే రోజు హన్మకొండకు వచ్చారు. 

ఏప్రిల్ 24 నుంచి భారత్ కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. దీంతో యూఏఈ ప్రభుత్వం భారతీయ విమానాలపై నిషేధాన్ని విధించడంతో వారు ఇక్కడే ఇరుక్కుపోయారు. ఆరుసార్లు విమాన టికెట్లు కొన్నప్పటికీ మారుతున్న నిబంధనలతో ప్రతిసారీ ప్రయాణం వాయిదా పడింది. 

అయితే వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, దౌత్యవేత్తలు, గోల్డెన్ వీసా కలిగిన వారు తమ దేశంలోకి రావొచ్చని యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ దంపతులిద్దరూ దుబాద్ కు తిరిగొచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అనుమతి కూడా లభించింది. ఇక, ఇతర ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో కేవలం ఈ ముగ్గురితోనే ఎయిర్ బస్ ఏ-320 ఎయిర్ అరేబియా విమానం హైదరాబాద్ నుంచి షార్జా చేరుకుంది. 

Leave a Comment