పండుగలపై ఆంక్షలు విధించిన తెలంగాణ సర్కార్..!

కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా వస్తున్న పండుగల నిర్వహణపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. షబ్-ఏ-బరాత్, హోలీ, ఉగాది, శ్రీరామనవమి, మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే, రంజాన్ తదితర వివిధ మతాల పండుగలు, ఉత్సవాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు. 

రాష్ట్రంలో బహిరంగ స్థలాలు, మైదానాలు, పార్కులు, ప్రార్థనా స్థలాల్లో మత సంబంధిత ర్యాలీలు, ఊరేగింపులు, ఉత్సవాలు, సామూహిక కార్యక్రమాలు, సమావేశాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ ఆంక్షలు ఏప్రిల్ 30 వరకు అమలులో ఉంటాయని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను, పోలీసులను ఆదేశించారు. 

బహిరంగ, పని ప్రదేశాల్లో, ప్రయాణాల్లో మాస్క్ ధరించడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటికి వెళ్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. లేకపోతే విపత్తు నిర్వహణ చట్టంతో పాటు ఐపీసీలోని సెక్షన్ 188 కింద కేసులు పెడతామని తెలిపారు. ఈ ఉత్వర్వులను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.  

Leave a Comment