ఏడాది క్రితమే ప్రేమ వివాహం.. ఇప్పుడు వీరమరణం..!

జమ్మూకశ్మీర్ లోని మాచిల సెక్టార్ లో ఆదివారం జరిగి ఉగ్రదాడిలో నలుగురు భారత జవాన్లు అమరులయ్యారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ఉండగా..వారిలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం కోమన్ పల్లికి చెందిన ర్యాడా మహేశ్(26) ఒకరు. దీంతో కోమన్ పల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. మహేశ్ 2015లో ఆర్మీ జవాన్ గా విధుల్లో చేరాడు. 

మహేశ్ 6వ తరగతి వరకు వేల్పూరు మండలం కుకునూర్ ప్రభుత్వ పాఠశాలలో, 7-10వ తరగతి వరకు వేల్పూరులోని జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో చదివారు. నిజిమాబాద్ లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ పూర్తి చేసిన అనంతరం ఆర్మీలో చేరాడు. గత ఏడాది డిసెంబర్ నెలలో ఇంటికి వచ్చిన మహేశ్ జనవరిలో వెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు.

మహేశ్ ఏడాది క్రితం హైదరాబాద్ కి చెందిన ఆర్మీ కమాండర్ కుమార్తె సుహాసినిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇంకా సంతానం కాలేదు. అక్టోబర్ వరకు డెహ్రాడూన్ లో విధులు నిర్వర్తించిన మహేశ్ బదిలీపై జమ్మూకశ్మీర్ కు వెళ్లాడు. ఆదివారం తెల్లవారుజామున ఉగ్రవాదులతో జరిగిన దాడిలో మహేశ్ వీరమరణం పొందారు. అయితే ఈనెల 2న తోటి జవాన్లతో కలిసి పెట్రోలింగ్ కి వెళ్తున్నానని, వచ్చాక ఫోన్ చేస్తానని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. అయితే అవే చివరి మాటలు అయ్యాయని కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. 

ఉగ్రదాడిలో వీరమరణం పొందిన మహేశ్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఘన నివాళులర్పించారు. మహేశ్ త్యాగం మరువలేనిదని, ఆయన కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. మహేశ్ త్యాగం పట్ల తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. మమ్మల్ని సురక్షితంగా ఉంచినందుకు ధన్యవాదాలని, మీ వీరత్వం ఎప్పటికీ మరిచిపోలేమని పేర్కొన్నారు.   

 

Leave a Comment