ఏకమవుదాం రండి.. 37 పార్టీల నేతలకు సీఎం స్టాలిన్ లేఖ..!

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో సామాజిక న్యాయ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేస్తున్న ‘ఆల్ ఇండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్’లో చేరాలంటూ పలు పార్టీల నేతలకు ఆహ్వానం పలికారు.. ఈ మేరకు 37 మంది కీలక రాజకీయ పార్టీల నేతలకు ఆయన లేఖ రాశారు. సోనియా గాంధీ, కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేజ్రీవాల్, మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లాలూ ప్రసాద్ యాదవ్, సీతారాం ఏచూరి, అసదుద్దీన్ ఒవైసీ సహా 37 మందికి ఈ లేఖలు పంపారు.

రాజకీయంగా అణచివేతకు గురవుతున్న వర్గాలు, ఇతర బలహీన వర్గాలకు న్యాయం చేయడం కోసం సమాఖ్య కృషి చేస్తుందని స్టాలిన్ తెలిపారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించడం ద్వారా మాత్రమే సమ సమజాన్ని నిర్మించగలమని పేర్కొన్నారు. సామాజిక న్యాయానికి రిజర్వేషన్ ఒక్కటే సరిపోదని, ప్రతి అడుగులోనూ కొన్ని ప్రత్యేక అధికారాలు ఉండాలని తెలిపారు. సమానత్వం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయంపై విశ్వాసమున్న వారంతా ఏకతాటిపైకి వచ్చి మతోన్మాదం, మతపరమైన ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకు రావాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. 

Leave a Comment