కరోనా వ్యాక్సిన్ వల్ల కూతురు చనిపోయిందని పిటిషన్.. రూ.వెయ్యి కోట్లు డిమాండ్..!

కరోనా వ్యాక్సిన్ వచ్చిన కొత్తలో కొంత మందిలో దుష్ప్రభావాలు వచ్చిన సంగతి తెలిసిందే.. అక్కడక్కడ కరోనా టీకా వల్ల ప్రాణాలు పోయాయని కూడా వార్తలు వచ్చాయి.. అలా కరోనా టీకా తీసుకోవడం వల్ల తన కూతురు చనిపోయిందని మహారాష్ట్ర ఔరంగబాద్ కి చెందిన ఓ వ్యక్తి బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. గతేడాది వ్యాక్సిన్ వేసుకొని సైడ్ ఎఫెక్ట్స్ తో తన కూతురు మరణించిందని పేర్కొన్నాడు. మహరాష్ట్ర ప్రభుత్వం, సదరు వ్యాక్సిన్ సంస్థ రూ.వెయ్యి కోట్లు పరిహారం చెల్లించేలా ఆదేశించాలని పిటిషన్ లో కోరాడు.. 

ఔరంగబాద్ కి చెందిన లునావత్ కూతురు స్నేహాల్.. ఈమె నాసిక్ లో వైద్య విద్యను అభ్యసిస్తోంది. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు టీకా తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో స్నేహాల్ 2021 జనవరి 28న కోవిషీల్డ్ టీకా తీసుకుంది. ఆ తర్వాత దుష్ప్రభావాల కారణంగా మార్చి 1న స్నేహాల్ మరణించినట్లు లునావత్ పిటిషన్ లో పేర్కొన్నాడు.. 

కరోనా టీకా సురక్షితమని, ఎలాంటి హానీ ఉండదని చెప్పారని, అది నమ్మి తన కూతురు వ్యాక్సిన్ తీసుకుందని లునావత్ చెప్పాడు. కొవిషీల్డ్ దుష్ప్రభావాల కారణంగానే తన కూతురు మరణించిందని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏఈఎఫ్ఐ కమిటీ గతేడాది అక్టోబర్ 2న వెల్లడించిందని తెలిపాడు. తన కూతురికి సరైన న్యాయం కావాలని, రూ.1000 కోట్లు పరిహారం చెల్లించాలని లునావత్ బాంబే హైకోర్టు పిటిషన్ లో వివరించారు. అయితే ఈ కేసు ఇంకా హైకోర్టు విచారణలోకి రాలేదు. గతవారమే పిటిషన్ దాఖలు చేశాడు..  

Leave a Comment