ఏసీబీ భయంతో రూ.20 లక్షలు కాల్చి బూడిద చేశాడు..!

ఏసీబీ భయంతో ఓ తహసీల్దార్ ఏకంగా రూ.20 లక్షల  నగదును కాల్చి బూడిద చేశాడు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. సిరోహీ జిల్లాలో బుధవారం సాయంత్రం ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయలను లంచంగా తీసుకుంటూ రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పర్వత్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు పర్వత్ ను విచారించారు. ఇందులో తన తప్పేమీ లేదని, తహసీల్దార్ కల్పేశ్ కుమార్ జైన్ కారణంగానే డబ్బు తీసుకుంటున్నానని తెలిపాడు. 

దీంతో ఏసీబీ అధికారులు అతడిని పట్టుకుని తహసీల్దార్ కల్పేశ్ ఇంటికి బయలుదేరారు. ఇంతలో తహసీల్దార్ కు ఏసీబీ అధికారులు వస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. ఇంకేముందు లంచంగా తీసుకున్న బ్లాక్ మనీ ఇంట్లోనే ఉంది. ఏం చేయాలో తెలియక సతమతమయ్యాడు. చివరికి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఆ డబ్బును కాల్చడం మొదలుపెట్టాడు. ఇలా ఏకంగా రూ.20 లక్షల నోట్ల కట్టలను కాల్చేశాడు. 

ఇంతలో ఏసీబీ అధికారులు అతడి ఇంటికీ చేరుకున్నారు. అతడు వంటింట్లో చేస్తున్న నిర్వాకాన్ని చూశారు. తలుపుకు గడియ ఉండడంతో అధికారులు తలుపులు పగలగొట్టి తహసీల్దార్ నిర్వాకాన్ని ఆపేశారు. మొత్తం రూ.20 లక్షలు కాలి బూడిద అయిపోయింది. అతడి వద్ద కేవలం రూ.1.5 లక్షలు మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారం మొత్తాన్ని ఓ అధికారి వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది.

 

Leave a Comment