ఒత్తిడిని తట్టుకోలేక నారాయణ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య..!

కళాశాల యాజమాన్యం ఒత్తిడిని తట్టుకోలేక నారాయణ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాలలో ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన చేతిపై రాసుకోవడంతో పాటు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. ఈ ఘటన కడప జిల్లా బి.కోడురు మండలం సిద్దుగారిపల్లెలో గురువారం చోటుచేసుకుంది. 

గ్రామానికి చెందిన నేలటూరి సుబ్బారెడ్డి, ప్రమీలమ్మల మూడో కొడుకు నేలటూరి శ్రీనివాసులరెడ్డి కడపలోని నారాయణ కాలేజీలో బైపీసీ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీ టాపర్ గా ఉన్న శ్రీనివాసులరెడ్డిపై కళాశాల యాజమాన్యం రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించి తమ కళాశాలకు మంచి పేరు తేవాలని గత కొన్ని రోజులుగా ఒత్తిడి పెంచింది. 

ఈ ఒత్తిడిని తట్టుకోలేక బుధవారం రాత్రి స్వగ్రామం సిద్దుగారిపల్లెకు వచ్చాడు. గ్రామానికి వచ్చిన శ్రీనివాసులరెడ్డి కళాశాలలో లెక్చరర్ల ఒత్తిడి తట్టుకోలేక తాను తనువు చాలిస్తున్నట్లు తల్లిదండ్రులకు లేఖ ద్వారా తెలియజేస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నన్ను మీరు కని పెంచినందుకు క్షమించండి.. ఐ మిస్ యూ అమ్మ.. మిస్ యూ నాన్న.. మిస్ యూ బ్రదర్’ అంటూ సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. అంతే కాదు అరచేతిపై ‘ప్రెజర్ ఇన్ కాలేజ్’ అని రాసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.   

Leave a Comment