ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. రోగికి స్వీపర్, సెక్యురిటీ గార్డులు వైద్యం.. వ్యక్తి మృతి..!

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఘోరం జరిగింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ పేషంట్ కి సెక్యురిటీ గార్డులు, స్వీపర్లు వైద్యం చేశారు. అనంతరం ఆ వ్యక్తి మృతి చెందాడు. ప్రస్తుతం ఇది రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.. మంగళవారం రాత్రి రామకృష్ణ అనే  లెక్చరర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యం కోసం తీసుకొచ్చారు. 

ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి డ్యూటీ డాక్టర్ ఇంజెక్షన్ వేసి వదిలేశారు. రామకృష్ణ తల, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో సెక్యురిటీ గార్డు, పారిశుధ్య సిబ్బంది కలిసి వైద్యం అందించారు. తలకు కుట్లు కట్టడం, సెలైన్లు పెట్టడం చేశారు. రామకృష్ణ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు స్ట్రెచర్ లో తీసుకెళ్తుండగా సెక్యురిటీ, స్వీపర్లు కట్టిన కట్లు ఊడిపోయాయి. 

ఆస్పత్రికి తరలించేలోపే లెక్చరర్ రామకృష్ణ మరణించారు. ఆత్మకూరు ఆస్పత్రిలో సరైన వైద్యం అందకనే రామకృష్ణ చనిపోయినట్లు అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో సెక్యురిటీ, స్వీపర్లు వైద్యం అందించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

Leave a Comment