యూపీలో అంతుచిక్కని వ్యాధి.. 32 మంది చిన్నారులు మృతి..!

ఉత్తరప్రదేశ్ లో అంతుచిక్కని వ్యాధి ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వ్యాధితో ఇప్పటి వరకు 39 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 32 మంది చిన్నారులు ఉన్నారు. ఫిరోజాబాద్ లో 32 మంది చిన్నారులు, ఏడుగురు పెద్దలు మరణించినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. డెంగ్యూ లాంటి జ్వరం కారణంగా ఈ మరణాలు సంభవించినట్లు పేర్కొన్నారు. 

ఫిరోజాబాద్ లోని 100 పడకల జిల్లా ఆస్పత్రిలో ఈ వ్యాధి బారినపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మరణించిన వారి కుటుంబాలకు తగిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆగస్టు 18న మొదటి కేసు నమోదైందని సీఎం వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో దాదాపు 200 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నట్లు వైద్యులు ప్రకటించారు. ఈ అంతుచిక్కని వ్యాధితో 102 డిగ్రీల సెల్సియస్ జ్వరం వస్తుందని, ఈ జ్వరం తగ్గడానికి నాలుగు రోజులు పడుతోందని వైద్యులు తెలిపారు. 

గతవారం 40 మంది పిల్లలు ఈవ్యాధితో మరణించినట్లు ఫిరోజాబాద్ ఎమ్మెల్యే మనీష్ అసిజా ఆదివారం ప్రకటించారు. అయితే ఈ వాదనను యూపీ ఆరోగ్య మంత్రి జై ప్రతాప్ తిరస్కరించారు. మూడో వేవ్ వచ్చిందన్న వాన సరికాదన్నారు. భారీ వర్షాలు, నీటి నిల్వ కారణంగా పిల్లలలో మలేరియా, డెంగ్యూ, అధిక జ్వరం లాంటి లక్షణాలు వస్తున్నాయన్నారు. కరోనా పరీక్షల్లో బాధితులకు నెగిటివ్ వచ్చిందని మంత్రి చెప్పారు. మిగిలిన వారి శాంపిల్స్ ను కూడా లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ, పుణెలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించామని తెలిపారు.   

 

Leave a Comment