మారువేశంలో ఎరువుల షాపుకు సబ్ కలెక్టర్..!

కైకలూరులోని ఎరువుల షాపుకు ఓ సాధారణ రైతు వేశంలో వెళ్లారు విజయవాడ సబ్ కలెక్టర్.. లుంగీ, షర్టు ధరించి వచ్చి యూరియా, డీఏపీ రెండు బస్తాలు కావాలని అడిగాడు. ఆ దుకాణదారుడు అడిగిన ఎరువులను ఇచ్చాడు. అయితే ఎంఆర్పీ ధర కంటే అధికంగా వసూలు చేశాడు. అధిక ధరలు వసూలు చేయడంపై ఆ దుకాణదారుడిని నిలదీశాడు. 

విజయవాడ సబ్ కలెక్టర్ జి.సూర్య సాయి ప్రవీణ్ చంద్ ఎరువుల దుకాణాల్లో తనిఖీల్లో భాగంగా శుక్రవారం ముదినేపల్లి మండలం దేవపూడి శ్రీలక్ష్మీగణేష్ ట్రేడర్స్ వద్దకు వెళ్లారు. అప్పటికి ఆ దుకాణం తెరవలేదు. అక్కడే ఉన్న రైతులను వాకబు చేశారు. ఎరువులు అధిక ధరలకు అమ్ముతున్నారని రైతులు తెలిపారు. వెంటనే వ్యవసాయ శాఖ ఏఓను పిలిపించి, ఆ దుకాణాన్ని తనిఖీ చేసి అధిక ధరలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

ఆ తర్వాత కైకలూరులో వాసవీ ఫెర్టిలైజర్స్ కు వెళ్లి యూరియా కావాలని అడిగారు. యూరియా లేదని ఆ దుకాణదారులు చెప్పాడు. అక్కడి నుంచి వెంకట నాగదత్త ఏజెన్సీస్ కు వెళ్లారు. యూరియా, డీఏపీ కావాలని అడిగారు. ఆ షాపు యజమాని ఎంఆర్పీ కన్నా ఎక్కువ వసూలు చేశాడు. పైగా బిల్లు కూడా ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన సబ్ కలెక్టర్ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి షాపు వద్దకు పిలిపించారు. వాసవీ ఫెర్టిలైజర్స్ లో తనిఖీ చేయగా గోడౌన్ లో యూరియా నిల్వలు ఉన్నాయి. స్టాక్ ఉన్నా లేదని చెప్పిన దుకాణాన్ని, అధిక ధర వసూలు చేసిన షాపును సీజ్ చేయించారు. 

Leave a Comment