కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలు : వైవి.సుబ్బారెడ్డి

 శ్రీ‌‌వారి వైభ‌వాన్ని విశ్వ వ్యాప్తం చేయడంలో భాగంగా కాశ్మీర్ నుండి క‌న్యాకుమారి వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యాలు నిర్మిస్తున్న‌ట్లు టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. ఈ సందర్భంగా వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ  సెప్టెంబ‌రు 19 నుండి 27వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌‌నున్న తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలను కోవిడ్ కార‌ణంగా ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌‌నున్న‌ట్లు పేర్కొన్నారు. అక్టోబ‌ర్‌లో నిర్వ‌హించే న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్సవాల‌ను అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఎలా నిర్వ‌హించాలో  నిర్ణ‌యిస్తామ‌న్నారు.

 టిటిడి ఆదాయం పెంచుకునే ఆలోచ‌న‌లో భాగంగా ఇక‌మీద‌ట న‌గ‌దు, బంగారు డిపాజిట్ల‌లో ప్ర‌తి నెల కొంత మొత్తానికి గ‌డువు తీరేలా బ్యాంకుల్లో జ‌మ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామన్నారు. ప్రస్తుత ప‌రిస్థితుల్లో ‌బ్యాంకులు త‌క్కువ వ‌డ్డీ ఇస్తున్నందు వ‌ల‌న టిటిడి డిపాజిట్ల‌కు ఎక్కువ వ‌డ్డీ వ‌చ్చేలా ఆర్‌బిఐ, ఇత‌ర బ్యాంకుల‌తో చ‌ర్చించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామని తెలిపారు. బ‌ర్డ్ ఆసుప‌త్రిలో కీళ్ల మార్పిడి శ‌స్త్ర చికిత్స చేసుకున్న వారి కోసం రూ. 5.4 కోట్లతో బ‌ర్డ్ ‌ప‌రిపాల‌న భ‌వ‌నం 3వ అంత‌స్తులో 50 ప్ర‌త్యేక గ‌దుల నిర్మాణానికి సమావేశంలో ఆమోదం తెలిపినట్లు చెప్పారు. పాత బ్లాక్‌లో చిన్న పిల్లల‌ ఆసుప‌త్రిని ప్రారంభించాల‌ని నిర్ణ‌యించామని, త్వ‌ర‌లో శ్వాశ‌త భ‌వ‌న‌లు నిర్మిస్తామని పేర్కొన్నారు. 

 విశాఖ దివ్య క్షేత్రం ఘాట్ ర‌హ‌దారికి వాలు గోడ‌ల నిర్మాణానికి రూ.4.95 కోట్లతో ‌ఆమోదం తెలిపారన్నారు. క‌రోనా ప‌రిస్థితులు అదుపులోకి వ‌చ్చాక ముఖ్య‌మంత్రి చేతుల మీదుగా ఈ ఆల‌యానికి మ‌హా కుంబాభిషేకం నిర్వ‌హిస్తామన్నారు. భువ‌నేశ్వ‌ర్ ఆల‌యానికి త్వ‌ర‌లో మ‌హా కుంబాభిషేకం నిర్వ‌హించి, ముంబైలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి శంఖుస్థాప‌న చేస్తామన్నారు.  వార‌ణాశిలో శ్రీవారి ఆల‌య నిర్మాణం కొసం భూమి కేటాయించాల‌ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వ‌నికి లేఖ రాశామని, జ‌మ్మూలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం భూమి కేటాయించిందని, ఇక్క‌డ కూడా త్వ‌ర‌లో ప‌నులు  ప్రారంభిస్తామని చెప్పారు.  

 రాష్ట్రంలోని దేవాదాయ‌శాఖ‌, టిటిడి, వివిధ ధార్మిక సంస్థ‌లు నిర్వ‌హిస్తున్న వేద పాఠశాల‌ల‌ను ఒకే గొడుగు కింద‌కు తెచ్చి, వేద విశ్వ విద్యాల‌యం ఆధ్వ‌ర్యంలో కామ‌న్ సిల‌బ‌స్ త‌యారుచేసి సంహిత (10వ త‌ర‌గ‌తి), మూలము (ఇంట‌ర్ మీడియేట్) ప‌రీక్ష‌లు నిర్వ‌హించి ఒకే స‌ర్టిఫికెట్ ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామని అన్నారు.

 

Leave a Comment