హైదరాబాద్ వన్ డ్రైవ్ రెస్టారెంట్ లోని లేడీస్ టాయిలెట్ లో స్పై కెమెరా..!

కొందరు దుర్మార్గులు షాపింగ్ మాల్స్, ఆఫీస్, హోటళ్ల బాత్రూముల్లో స్పై కెమెరాలు పెట్టి మహిళల వీడియో తీసి వారిని బ్లాక్ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అంతేకాదు బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. ఇలాంటి కెరాలు ఎక్కడ దాచారో గుర్తించడం చాలా కష్టం.. తాజాగా హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో వన్ డ్రైవ్ రెస్టారెంట్  బాత్రూంలో సీక్రెట్ కెమెరా ఉదంతం వెలుగులోకి వచ్చింది. 

జూబ్లీహిల్స్ లో వన్ డ్రైవ్ ఫుడ్ కోర్టులో నల్గోండ జిల్లా బట్టి గూడెం గ్రామానికి చెందిన బొంగరాల బెనర్జీ(18) ఆరు నెలల నుంచి హౌస్ కీపింగ్ బాయ్ గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం తన సెల్ ఫోన్ కెమెరా ఆన్ చేసి హోటల్ లేడీస్ టాయిలెట్ లో పెట్టాడు. అందులో రికార్డ్ అయిన వీడియోలను చూస్తుండేవాడు. మూడు రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా ఇలానే చేశాడు. 

 అయితే బుధవారం ఆ హోటల్ లో టాయిలెట్ కి వెళ్లిన ఓ యువతి ఆ సెల్ ఫోన్ ను గమనించింది. వెంటనే హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. యాజమాని ఫిర్యాదుతో పోలీసులు బెనర్జీని అరెస్టు చేశారు. సెల్ ఫోన్ సీజ్ చేశారు. ఆ సెల్ ఫోన్ లో సుమారు 20 మంది మహిళల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన రెస్టారెంట్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు రోజుల నుంచే ఈ తంతు జరుగుతుందా లేదా ఇంతకు ముందు కూడా ఏమైనా వీడియోలు తీశాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   

 

Leave a Comment