‘జగన్నాధుడి రథచక్రాల కింద విపక్షాలు నలిగిపోవాల్సిందే’..

రాష్ట్రంలో సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజానీకానికి సమన్యాయం, సామాజిక న్యాయం చేస్తూ పరిపాలన సాగిస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారం అన్నారు. ఇంత గొప్పగా సామాజిక న్యాయం జరుగుతుంటే విపక్షాలు విమర్శలు చేయడమే కాకుండా రాష్ట్రంలో అల్లర్లు, విధ్వంసాలకు పాల్పడుతున్నాయన్నారు. 

అంబేద్కర్‌- కోనసీమగా జిల్లా పేరు పెడితే తప్పా? అంబ్కేదర్‌ పేరు పెట్టడాన్ని సమర్థిస్తున్నారో? వ్యతిరేకిస్తున్నారో విపక్షాలు చెప్పాలి? అని తమ్మినేని సీతారం ప్రశ్నించారు. రాష్ట్రంలో సంతృప్తికరమైన పరిపాలన కొనసాగుతోందన్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్‌ మోహన్‌ రెడ్డిగారే అవుతారని ప్రతి గడపలో నినాదం వినిపిస్తోందన్నారు.  

చంద్రబాబు నాయుడు ఏనాడు అయినా సామాజిక న్యాయం గురించి ఆలోచించారా? అని ప్రశ్నించారు. దళితులను, బీసీలను అవమానించిన వ్యక్తి చంద్రబాబు అని, చంద్రబాబు అసలు ఒక నాయకుడా? అని సీతారం విమర్శించారు. టీడీపీ జరిపేది మహానాడు కాదు… వల్లకాడు అని అన్నారు.  తెలుగుదేశం కుళ్ళి, కృశించిపోయిన పార్టీ, అటువంటి పార్టీకి దహన సంస్కారాలు చేస్తున్నారని తెలిపారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ అమలు చేస్తున్న సామాజిక న్యాయ  సునామీలో టీడీపీ, ఇతర విపక్షాలన్నీ కొట్టుకుపోవాల్సిందే అని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో…  జగన్నాధుడి రథచక్రాల కింద విపక్షాలు నలిగి, నశించి కుంగి కృశించిపోవాల్సిందే అని తెలిపారు. వైయస్సార్‌ సీపీకి వేసే ప్రతి ఓటు సామాజిక న్యాయం, మన ఆత్మ గౌరవం నిలబెట్టుకోవడం కోసం వేసేందుకు తోడ్పాటు అవుతుందన్నది గుర్తు పెట్టుకోవాలి అన్నారు.. 

 

 

Leave a Comment