Facebook లైవ్ లో యువకుడి ఆత్మహత్యాయత్నం..!

ఓ యువకుడు ఫేస్ లైవ్ పెట్టి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. ఫేస్ బుక్ లైవ్ వీడియో ప్రకారం.. తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ కు చెందిన దిలీప్(23) అనే దళిత యువకుడు, చింతలఠాణా గ్రామానికి చెందిన అగ్రవర్ణ కులానికి చెందిన యువతి ఇద్దరు ప్రేమించుకున్నారు. యువతి అనారోగ్యానికి గురైనప్పుడు దిలీప్ రూ.3 లక్షల వరకు ఆర్థిక సాయం చేశాడు. 

తర్వాత యువతి తల్లిని కలిసి ప్రేమ విషయం చెప్పాడు. దీంతో యువతి తల్లి దిలీప్ ని కులం ఏంటని అడిగింది. కులం తెలిసి దూషించింది.. ఆ తర్వాత యువతి కుటుంబ సభ్యులు దిలీప్ పై సిరిసిల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత దిలీప్ ఇంటికెళ్లి అతడి ఫోన్లో యువతితో కలిసి దిగిన ఫొటోలను తీయించేశారు. తర్వాత దిలీప్ పై కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేశారు. 

ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చిన దిలీప్ ఫేస్ బుక్ లైవ్ పెట్టి పురుగుల మందు తాగాడు. పోలీసులు తనను వేధించడంతో పాటు తప్పుడు కేసులు పెట్టారన్నాడు. వారి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని చెప్పాడు. కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు. 

యువతి, ఆమె కుటుంబ సభ్యులతో దిలీప్ దురుసుగా ప్రవర్తించాడని ఫిర్యాదు అందడంతోనే కేస్ పెట్టామని సిరిసిల్ల సీఐ తెలిపారు. అతడ్ని కొట్టడం కాని తిట్టడం కానీ చేయలదేదని, దిలీప్ ని స్టేషన్ కి రమ్మని ఫోన్ చేస్తే ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడని సీఐ పేర్కొన్నారు. దిలీప్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని వివరించారు. 

 

Leave a Comment