ప్రాణం తీసిన క్రిప్టో కరెన్సీ.. ‘పిల్లలు జాగ్రత్త’ అంటూ..!

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టి నష్టపోయిన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బుధవారం సూర్యాపేటలోని ఓ లాడ్జిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల మేరకు ఖమ్మం పట్టణానికి చెందిన రామలింగ స్వామి(36) తన స్నేహితులు ఆనంద్ కిషోర్, నరేశ్ తో కలిసి ఇటీవల క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టారు. ట్రస్ట్ వాలెట్ అనే యాప్ లో ముగ్గురు కలిసి తొలుత రూ.10 లక్షలతో క్రిప్టో కరెన్సీను కొనుగోలు చేశారు.

కొద్ది రోజులకు ఆ పెట్టుబడి రెట్టింపు అయింది. దీంతో మరికొంత మంది స్నేహితులతో రూ.1.30 కోట్ల వరకు పెట్టుబడి పెట్టించారు. మొదటి మూడు వారాలు లాభాలు వచ్చాయి. దీంతో మరింత పెట్టుబడి పెట్టారు. అందులోనూ లాభాలు వచ్చాయి. అయితే డబ్బులు డ్రా చేయడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. పెట్టిన పెట్టుబడిలో రూ.60 లక్షలు తిరిగి రాగా రూ.70 లక్షల వరకు యాప్ లో సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయాయి. 

దీంతో రామలింగస్వామిపై ఒత్తిడి పెరిగింది. డబ్బులు పెట్టుబడి పెట్టిన వారు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఒత్తిడి చేశారు. అంతేకాదు ఇటీవల రామలింగస్వామికి చెందిన రూ.40 విలువైన కారును లాక్కెళ్లారు. ఇది అవమానంగా భావించిన రామలింగస్వామి మనస్తాపంతో మంగళవారం సూర్యాపేటలోని ఓ లాడ్జలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం గది నుంచి దుర్వాసన రావడంతో లాడ్జి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. 

రామలింగస్వామి ఓ సూసైడ్ లెటర్ రాశారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టి నష్టపోయానని, తనతో పాటు చాలా మంది నష్టపోయారని సూసైడ్ లెటర్ లో పేర్కొన్నాడు. తాను ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని రాశారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తన భార్య స్వాతికి సూచించారు. ఇలా చేయాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని, ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ లెటర్ లో పేర్కొన్నారు. 

Leave a Comment