చదివింది స్కూల్ విద్యే.. కన్న బిడ్డను బతికించుకోవడం కోసం.. సొంతంగా మందు తయారు చేసిన తండ్రి..!

అరుదైన వ్యాధితో కన్నబిడ్డ చనిపోతాడని తెలిసి ఏ తల్లిదండ్రులైనా తట్టుకోగలరా.. ఎంత పెద్ద ఆస్పత్రికైనా తీసుకెళ్లి బతికించుకునేందుకు ప్రయత్నిస్తారు.. అయితే ఆ వ్యాధికి అసలు మందు లేకపోతే.. ఏంచేయాలో తెలియక దేవుణ్ని ప్రార్థిస్తూ కూర్చుంటారు.. కానీ ఈ తండ్రి మాత్రం అలా చేయలేదు. సొంతంగా మందు తయారు చేసి బిడ్డను కాపాడుకునే ప్రయత్నం చేశాడు..

వివరాల మేరకు చైనాలోని కన్ మింగ్ ప్రాంతానికి చెందిన గ్జువీ పాఠశాల విద్య చదివి.. చిన్నపాటి ఆన్ లైన్ వ్యాపారం చేసుకుంటున్నాడు. అతడికి రెండేళ్ల కుమారుడు హావోయాంగ్ ఉన్నాడు.. ఆ బాలుడు మెంకెస్ సిండ్రోమ్ అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి మెదడు, నాడీ వ్యవస్థ అభివృద్ధికి ఆటంకంగా మారింది. ఈ వ్యాధితో బాధపడే వారు మూడేళ్ల కంటే ఎక్కువ కాలం బతకరు.. మందులు వాడితే లక్షణాలు తీవ్రం కాకుండా ఉంటాయి. అయితే అవి చైనాలో దొరకడం లేదు.. కరోనా ఆంక్షల కారణంగా విదేశాలకు వెళ్లడం వీలుకాలేదు. దీంతో ఎలాగైన తన బిడ్డను కాపాడుకోవాలని అనుకున్నాడు.. 

తన బిడ్డను బతికించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అందుకోసం ఒక ల్యాబ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆన్ లైన్ లో ఈ వ్యాధి గురించి, దాని చికిత్స, మందు గురించి తెలుసుకున్నాడు. ఫార్మాకి సంబంధించిన విషయాలు ఇంగ్లీష్ లో ఉండటంతో ట్రాన్స్ లేటర్ సాఫ్ట్ వేర్ సాయంతో విశ్లేషించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఈ వ్యాధి లక్షణాలను తగ్గించడంలో కాపర్ హిస్టాడిన్(రాగి) సహాయం చేయగలదని తెలుసుకున్నాడు. 

ఆ తర్వాత ఆరు వారాల పాటు పరిశోధన చేసి మొదటి వయల్ ను సిద్ధం చేసుకున్నాడు. దానిని మొదట ఎలుకల మీద ప్రయోగించాడు. వాటికి ఏమీ కాకపోవడంతో.. తాను ఎక్కించుకున్నాడు.. అతడు ఎలాంటి అస్వస్థతకు గురికాలేదు. ఆ తర్వాత తన బిడ్డకు ఆ మందును ఎక్కించాడు. ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో ఆ మందును ఇవ్వడం కొనసాగించాడు. రెండు వారాల తర్వాత రిపోర్ట్స్ నార్మల్ గా వచ్చాయి. ఆ పిల్లవాడు అయితే మాట్లాడలేడు కానీ తన తండ్రి ఆ పిల్లవాడి తల మీద చేయి వేయగానే చిరు నవ్వు చిందిస్తాడు. అయితే కాపర్ చికిత్స కొన్ని జన్యుపరమైన వ్యాధులకు మాత్రమే పనిచేస్తుందని, సాధ్యమైనంత వరకు బిడ్డ పుట్టిన మూడు వారాల్లోనే దానిని అందించాలని వైద్య నిపుణులు తెలిపారు. 

అయితే గ్జువీ తన బిడ్డ కోసం ఎంతటి కష్టానికైనా వెనుకాడటం లేదు. తన కుమారుడిని రక్షించుకోవడం కోసం మాలిక్యులార్ బయోలజీ చదివేందుకు సిద్ధమయ్యాడు. తన బిడ్డ మరణం కోసం నిరీక్షించేలా చేయదల్చుకోలేదని, ఒక వేళ విఫలమైనా తన బిడ్డ ఆశతో జీవించేలా చేయాలనుకుంటున్నానని గ్జువీ చెబుతున్నాడు. మెంకెస్ సిండ్రోమ్ అనేది లక్ష మందిలో ఒకరికి వచ్చే వ్యాధి.. ఈ వ్యాధి నుంచి తన బిడ్డను కాపాడుకునేందుకు ఆ తండ్రి పడిన తపనను వైద్యులు ప్రశిస్తున్నారు. అయితే వైద్యల పర్యవేక్షన లేకుండా ఇలాంటి ప్రయోగాలు చేయడం సరికాదని వారు హెచ్చరిస్తున్నారు. వెక్టర్ బిల్డర్ అనే అంతర్జాతీయ బయోటెక్ ల్యాబ్ గ్జువీ పరిశోధనపై ఆసక్తి ప్రదర్శించి అతనితో కలిసి మెంకెస్ సిండ్రోమ్ పై పరిశోధన ప్రారంభించింది.  

Leave a Comment