ఏపీ సీఎం జగన్ తో విభేదాలపై షర్మిల క్లారిటీ..!

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకే తాను వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించినట్లు పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేసిన షర్మిల తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని పార్టీని స్థాపించామని వెల్లడించారు. 

ఈ సమావేశంలో ఏపీ సీఎం జగన్ తో తనకు విభేదాలున్నాయని, అందుకే పార్టీ పెట్టినట్లు జరుగుతున్న ప్రచారంపై షర్మిల స్పందించారు. ఏపీ సీఎం జగన్ పై అలిగి తాను పార్టీ పెట్టాననడం సరికాదన్నారు. జగన్ మీద అలిగితే మాట్లాడ్డం మానేస్తానను కానీ పార్టీ పెట్టనని అన్నారు. ఏపీలో రాజన్న రాజ్యం వస్తున్నట్లే కనిపిస్తోందని, తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే ధ్యేయంగా పార్టీ పెట్టినట్లు షర్మిల తెలిపారు. 

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకి కాదని, ప్రత్యేక రాష్ట్రం అంశాన్ని యూపీఏ మేనిఫెస్టోలో చేర్చిన ఘనత వైఎస్సార్ సొంతమని షర్మిల తెలిపారు. కానీ వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో పరిస్థితులు లేవని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, సీఎం కేసీఆర్ మహిళలకు విలువ ఇవ్వరని విమర్శించారు.

మహిళలు కేవలం పూజలు, వ్రతాలు చేసుకోవాలని తెలంగాణ ఐటీశాఖ మంత్రి, కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని, తాను మాత్రం నిరుద్యోగులకు ఉద్యోగాలు తీసుకొచ్చేందుకు వ్రతం చేస్తున్నానని షర్మిల వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ నియంతల వ్యవహరిస్తున్నారని, ప్రశ్నించే అవకాశాన్ని ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కేసీఆర్ అధికార దుర్వినియోగం చేస్తూ దొరల పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని షర్మిల అన్నారు. తన తండ్రి వైఎస్సార తరహాలోనే పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నానని షర్మిల తెలిపారు. 

 

Leave a Comment