హైదరాబాద్ లో కొత్త వ్యాధి కలకలం.. పిల్లలకే ఎక్కువగా సోకుతున్న వ్యాధి..!

హైదరాబాద్ లో కొత్త వ్యాధి ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది రోజులుగా 15 మంది స్క్రబ్ టైఫస్(బుష్ టైఫస్) అనే కొత్త వ్యాధి బారిన పడ్డారు. వీరంతా  గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. బాధితుల్లో పిల్లలే ఎక్కువ మంది ఉన్నట్లు సమాచారం..ఈ నెలలో నలుగురు చిన్నారులు గాంధీ ఆస్పత్రిలో చేరారు. వీరిలో ఇద్దరికి తగ్గిపోగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఒడిశా రాష్ట్రంలో దాదాపు 500 కేసులు నమోదు కాగా.. యూపీలో కూడా చాలా మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడ్డారు. 

ఏంటీ ఈ స్క్రబ్ టైఫస్?

స్క్రబ్ టైఫస్ అనేది ఓరియెంటియా త్సుత్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల వ్యాపిస్తుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. చిగ్గర్స్ అనే పురుగు కాటు ద్వారా ఇది వ్యాప్తు చెందుతుంది. ఈ పురుగులు నల్లిని పోలి ఉంటాయి. ఇళ్లలో మంచాలు, పెరటి మొక్కల్లో, తడిగా ఉండే ప్రాంతాల్లో తిరుగుతుంటాయి. రాత్రి సమయంలోనే ఈ పురుగులు ఎక్కువగా కనిపిస్తాయి. స్క్రబ్ టైఫస్ ను నివారించేందుకు ఇప్పటి వరకు టీకా అందుబాటులో లేదు. 

స్క్రబ్ టైఫస్ లక్షణాలు:

  • ఈ పురుగు కుడితే తీవ్రమైన జ్వరం, చలి, ఒళ్లు, కండరాల నొప్పులు, ఒళ్లంతా దద్దుర్లు వస్తాయి.
  • పురుగు కాటుకు గురైన 10 రోజులలోపు ఈ లక్షణాలు ప్రారంభమవుతాయి. 
  • ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.   

 

Leave a Comment