ఏపీలో మారిన ఇసుక పాలసీ..కొత్త పాలసీకి కేబినెట్ ఆమోదం..!

ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన గురువారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ముఖ్యంగా కొత్త ఇసుక పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అన్ని రీచులను ఒకే సంస్థకు అప్పగించాలన్న సిఫార్సులకు కేబినెట్  ఓకే చెప్పింది. 

ప్రజలకు కోరినంత నాణ్యమైన ఇసుకను అందించేందుకు సవరించిన ఇసుక పాలసీని చర్చించి ఆమోదించారు. ఇసుక విధానం మెరుగుపరచడం కోసం సిఫార్సుల నిమిత్తం సీఎం జగన్ మంత్రుల కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ సభ్యులు ఇసుక విధానంపై అధ్యయనం చేసి ప్రజల సౌలభ్యం కోసం ఇసుక రీచ్ ల నుంచే ఇవ్వాలని సూచించింది. 

మంత్రుల కమిటీ చేసిన పలు సూచనలను పరిశీలించిన సీఎం జగన్ విధాన రూపకల్పన కోసం ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించాలని భావించారు. సీఎం సూచన మేరకు ఈ అంశాలపై ప్రజల నుంచి సలహాలు కోరుతూ అధికారులు పత్రికా ప్రకటనలు ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలకు అనుగునంగా ఇసుక పాలసీని ప్రభుత్వం సవరించింది. 

ప్రభుత్వమే ఇసుక ధర నిర్ణయిస్తుంది. ప్రజలు నేరుగా రీచుల వద్ద డబ్బు చెల్లించి ఇసుక తీసుకెళ్లవచ్చు. స్టాక్ యార్డులు ఉండవు. రీచ్ ల నుంచి తమకు నచ్చిన వాహనాల్లో ఇసుక తీసుకెళ్లే స్వేచ్ఛ ప్రజలకు ఉంటుంది. అవసరాలకు అనుగుణంగా నదుల్లో పెద్ద ఎత్తున డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక వెలికితీతకు ప్రాధాన్యం ఇస్తారు. రీచ్ ల నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు అప్పగించాలని తొలుత నిర్ణయం తీసుకున్నారు.

అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుకురాకపోవడంతో ఒకే సంస్థకు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చిందిన పేరుగాంచిన ప్రైవేటు సంస్థకు అప్పగించాలని కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది. ఓపెన్ టెండర్ ద్వారా ప్రక్రియ చేపట్టాలని సబ్ కమిటీ సూచించింది. ఆ సిఫార్సులపై చర్చించి మంత్రి వర్గ సమావేశంలో ఓకే చెప్పారు. 

 

Leave a Comment