స్నేహితుడి వైద్యం కోసం రూ.1 లక్ష విరాళం ఇచ్చిన తోటి మిత్రులు..!

వారంతా డిగ్రీ కళాశాలలో స్నేహితులు.. ఆడుతూ.. పాడుతూ చదువుకుంటూ సరదాగా ఉంటున్న సమయంలో అనుకోకుండా మహబూబ్ బాష అనే స్నేహితుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తమతో పాటు ఉంటూ చదువుకునే తోటి స్నేహితుడి ఒక కాలికి తీవ్ర గాయాలై నడవలేని స్థితిలో ఉన్నాడు. తమ మిత్రుడికి తామున్నామంటూ తోటి మిత్రులు చేయూత అందించి స్నేహమంటే ఇదేరా అనిపించారు.

కర్నూలు జిల్లాలోని కోసిగి గ్రామ చావిడి సమీపాన నివాసం ఉండే పేద కుటుంబానికి చెందిన బాష, భానోజీ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు మహబూబ్ బాష.. భర్త చనిపోవడంతో భానోజీ కూలీ పని చేసుకుంటూ తన కుమారుడిని డిగ్రీ వరకు చదివించింది.     

కాగా, గత ఏడాది జూన్ లో మహబూబ్ బాష ఎమ్మిగనూరుకు వెళ్లి బైక్ పై తిరిగి వస్తుండగా బైక్ అదపుతప్పి బోల్తా పడింది. ఆ ఘటనలో మహబూబ్ బాష ఎడమ కాలుకు తీవ్ర గాయామైంది. దీంతో కాలు నరాలు దెబ్బతిన్నాయి. వైద్యులు ఆపరేషన్ చేయాలని చెప్పడంతో కర్నూలులోని గౌరీ గోపాల్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. కానీ ఫలితం కనిపించలేదు.

కాగా మరోసారి కాలుకు ఆపరేషన్ చేయాలని హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రి వైద్యులు చెప్పారు. దీంతో ఆర్థిక సహాయం కోసం రోజుల తరబడి ఎదురు చూశారు. స్నేహితుడి అవస్థను గమనించిన తోటి స్నేహితులు మహబూబ్ బాషకు తామున్నామంటూ ముందుకొచ్చారు. 

ఆపరేషన్ కోసం అయ్యే ఖర్చు లక్ష రూపాయలను విరాళాల ద్వారా సేకరించారు. సేకరించిన మొత్తాన్ని స్నేహితుడికి అందజేశారు. ఆపదలో ఉన్న స్నేహితుడి కోసం తోటి మిత్రులైన మహిమకర రాజు, జీవన్, తిమ్మయ్య, రాధిక, పవిత్ర, గణేష్ తదితరులు కోసిగిలో కళాశాలలు, పాఠశాలలకు వెళ్లి తలొ కొంత సహాయం చేయాలని కోరారు. 

అలా రూ.1 లక్ష నగదు వసూలు చేసి స్నేహితుడికి ఆర్థిక సహాయం చేశారు. మిత్రుడికి అండగా ఉంటూ స్నేహితులకు మించిన నేస్తం లేదని నిరూపిస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఆపరేషన్ కోసం చేయూతను ఇచ్చిన స్నేహితుల తీరును మెచ్చి పలువురు హర్షం వ్యక్తం చేశారు. 

 

Leave a Comment