దారుణం.. 40 మంది చిన్నారులపైకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు చిన్నారులు దుర్మరణం..

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ప్రార్థనా ర్యాలీగా వెళ్తున్న 40 మంది చిన్నారులపై లారీ దూసుకెళ్లింది. వారిలో నలుగురు చిన్నారులు మరణించగా, 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జిల్లాలోని శిరివెళ్ల మండలం యర్రగుం వద్ద కర్నూలు-కడప జాతీయ రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే.. యర్రగుంట్ల ఎస్సీ కాలనీలో గత ఏడాది ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు. అప్పటి నుంచి క్రిస్మస్ ముందస్తు వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందులో బాగంగా ఈ ఏడాది కూడా రెండు వారాల నుంచి వేడుకలు జరుగుతున్నాయి. రోజు పాస్టర్ ఆధ్వర్యంలో తెల్లవారుజామున చర్చి ప్రాంగణం నుంచి బయలుదేరి గీతాలాపన చేస్తూ వాడవాడలా తిరిగేవారు. 

సోమవారం రాత్రి పాస్టర్ సొంత పనులపై వెళ్లడంతో కాలనీలోని కొందరు చిన్నారులు రాత్రి చర్చిలోనే బస చేశారు. తెల్లవారుజామున వాయిద్య పరికరాలను వాయిస్తూ, ప్రార్థనా గీతాలు ఆలపిస్తూ బయలుదేరగా, వారికి కాలనీలోని మరికొందరు చిన్నారులు జత కలిశారు. సుమారు 40 మంది చిన్నారులు వారికి తోడుగా నలుగురు పెద్దలు తమ కాలనీలో తిరిగిన తర్వాత వేరే కాలనీకి బయలు దేరారు. 

ఆ సమయంలో హైదరాబాద్ నుంచి కడప వైపునకు వేగంగా వెళ్తున్న డీసీఎం లారీ వారి మీదుగా దూసుకెళ్లింది. దీంతో గుంపుగా వెళ్తున్న వారు రోడ్డుపై చెల్లచెదురుగా పడిపోయారు. సమీపంలోని వారు గమనించి అక్కడికి చేరుకునేలోపు చిన్నారులు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ కనిపించారు. ఈ ప్రమాదంలో సుస్మిత(15), వంశీ(12), ఝాన్సీ(15), హర్షవర్ధన్(8) అనే చిన్నారులు మరణించారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. 

 

Leave a Comment