జీడిమెట్లలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!

హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాహనదారులు పట్టించుకోవడం లేదు. హెల్మెట్ తప్పనిసరి అని, హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే లైసెన్స్ రద్దు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నా.. మనకేం అవుతదిలే అంటూ నిర్లక్ష్యం చేస్తున్నారు. వాహనదారుల  ప్రాణాలు కాపాడేందుకు పోలీసులు ఎన్ని జాగ్రత్తలు, సూచనలు చేస్తున్నా వాటిని పెడచెవిన పెట్టేస్తున్నారు. 

కాగా ఆదివారం జీడిమెట్ల చింతల్ లో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి ఏమరపాటుగా రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో అటువైపుగా ఓ బైక్ వేగంగా వస్తోంది. బైక్ సమీపించడంతో పాదచారి పరుగెత్తుకెళ్లాడు. దీంతో బైక్ అతన్ని ఢీకొట్టింది. రోడ్డు దాటుతున్న వ్యక్తికి, బైకర్ కి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం..

అయితే ఈ రోడ్డుకు సంబంధించిన వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. బైక్ నడిపే వ్యక్తి హెల్మెట్ ధరించకపోవడంతో అతనికి తలకు తీవ్ర గాయాలయ్యాయని, హెల్మెట్ ధరించి ఉంటే అతడు ఇంత తీవ్రంగా గాయపడేవారు కాదని పేర్కొన్నారు. పాదచారి నిర్లక్ష్యం, బైకర్ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలిపారు. 

 

Leave a Comment