ఇక బియ్యం కార్డే.. ఇన్ కమ్ సర్టిఫికెట్..!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఇన్ కమ్ సర్టిఫికెట్) కాలపరిమితి ఏడాది నుంచి నాలుగేళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే, బియ్యం కార్డుదారులకు ఇకపై ఇన్ కమ్ సర్టిఫికెట్ అవసరం లేదని, ఆ కార్డు వారి ఆదాయానికి కొలమానంగా పేర్కొంటూ మరో నిర్ణయం కూడా తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతూ ఆ రెండు ఫైళ్లపై ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ శనివారం సంతకం చేశారు. సచివాలయంలోని అయిదో బ్లాక్ లో రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించారు. ఈ  సందర్భంగా బియ్యం కార్డుదారులకు ఇన్ కమ్ సర్టిఫికెట్ మినహాయింపుతో పాటు ఏడాది నుంచి నాలుగేళ్లకు ఇన్ కమ్ సర్టిఫికెట్ కాల పరిమితి గడువు పెంపుపై ఆయన తన తొలి సంతకం చేశారు. 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు కీలకమైన రెవెన్యూ, స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ల శాఖ అప్పగించారన్నారు. తనపై ఆయన ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేశారు. భూ వివాదాల పరిష్కారానికి త్వరలో భూ సర్వే చేపట్టనున్నట్లు మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. బియ్యం కార్డే ఇన్ కమ్ సర్టిఫికెట్ గా గుర్తించడం వల్ల పేదలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఇన్ కమ్ సర్టిఫికెట్ ఏడాది నుంచి నాలుగేళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ప్రయాస తప్పుతుందన్నారు. 

 

Leave a Comment