‘పుష్ప’ లెవెల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్.. పండ్ల లారీ అంటూ పోలీసులను బోల్తా కొట్టించాడు..!

మీకు పుష్ప సినిమా గుర్తుంది కదూ.. ఈ సినిమాలో పుష్ప పాల వ్యాన్ లో సగం వరకు పాలు వేసి కింద ఎర్ర చందనం దుంగలను వేసి తరలిస్తుంటాడు. చెక్ పోస్టు వద్ద పోలీసులు కూడా గుర్తించలేని విధంగా లారీని తయారు చేసి సరుకు దాటిస్తుంటాడు. ఈ సినిమాలొ ఎర్ర చందనం దొంగతనంగా రవాణా చేయడంలో అల్లుఅర్జున్ దిట్ట. అయితే ఇదంతా సినిమాలో.. 

కానీ నిజంగానే ఓ స్మగ్లర్ ఎర్ర చందనాన్ని రవాణా చేయడంలో ఎక్స్ పర్ట్.. అలాంటి స్మగ్లర్ చివరికి కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దులలో పోలీసులకు దొరికిపోయాడు.. నిందితుడు సయ్యద్ యాసిన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.. అతని వద్ద రూ.2.45 కోట్ల విలువైన దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఎర్ర చందనం దుంగలను తరలించేందుకు ఉపయోగించిన లారీ విలువ రూ.10 లక్షలకు పైగానే ఉంటుందని పోలీసులు తెలిపారు. 

బెంగళూరు సమీపంలోని ఆనేకల్ ప్రాంతానికి చెందిన యాసిన్ తన లారీలో కోవిడ్ బాధితులకు పండ్లను సరఫరా చేస్తున్నట్లుగా పోలీసులకు చెప్పేవాడు. ప్రతి చెక్ పోస్ట్ వద్ద పోలీసులను ఇలాగే నమ్మించేవాడు. అంతేకాదు తన లారీ ముందు భాగంలో పండ్లను సరఫరా చేసే వాహనం అంటూ పెద్ద అక్షరాలతో రాయించాడు.

అయితే ఈ పండ్ల చాటున పెద్ద ఎత్తున ఎర్రచందనం తరలించేవాడు.. ఏపీలోని ఓ గుర్తు తెలియని ప్రాంతం నుంచి ఈ దుంగలను తీసుకెళ్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులలో పోలీసులను ఈజీగా బోల్తా కొట్టించినా.. చివరికి మహారాష్ట్ర పోలీసులకు చిక్కాడు. మహారాష్ట్రలోని గాంధీ చౌక్ ప్రాంతంలో నిర్వహించిన పోలీసుల తనిఖీలో నిందితుడు పట్టుబడ్డాడు. ఇక అతడి వెనుక ఉన్న ముఠా గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.   

     

Leave a Comment