నాలుగు రోజుల్లో కోస్తా, రాయలసీమలో వర్షాలు

భారత వాతావరణ శాఖ (ఐఎండి) వాతావరణ సూచనల ప్రకారం  దక్షిణ అండమాన్‌ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు శుక్రవారం తెలిపారు. అల్పపీడనం 48 గంటల్లో బలపడి ఆ తదుపరి 48 గంటల్లోపు (నాలుగు రోజుల్లో) వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

కోస్తాంధ్ర , రాయలసీమలో పలుచోట్ల పిడుగులతో  కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని  విపత్తుల నిర్వహణ శాఖ కమిషన్ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు. సముద్రం అలజడిగా ఉంటుందని,  కోస్తా తీరం వెంబడి గంటకు 30-40 కీ.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని విపత్తుల శాఖ కమిషనర్ సూచించారు. 

రాయలసీమలో ఎండలు..

ఇటు రాగల 48 గంటలు రాయలసీమలో పలుచోట్ల 41°C -43°C అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున వడగాలుల బారిన పడకుండా మహిళలు, పిల్లలు, వృద్దులు సరైన జాగ్రత్తలు  తీసుకోవాలని కోరారు. రెండు రోజులపాటు  పిడుగులు పడే అవకాశం  ఉన్నందున   ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు రైతులు, కూలీలు, పశు , గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కన్నబాబు సూచించారు.

 

Leave a Comment