ఆరోగ్య సేతు యాప్ ప్రతి ఒక్కరూ వాడాలి

కొవిడ్-19పై జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలి

సీఎస్ నీలం సాహ్ని

ఆరోగ్య సేతు యాప్ ను ప్రతి ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకునేలా ప్రజలను చైతన్య పరచాలని, దీనిపై ఇప్పటికే జీఓ 254 ద్వారా ఉత్తర్వులు జారీ చేశామని సీఎస్ నీలం సాహ్ని తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై శుక్రవారం విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరోగ్య సేతు యాప్ ను ప్రతి ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకుని వినియోగించేలా చూడాలని చెప్పారు. 

కరోనా వైరస్ పై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి వారికి అవసరమైన సమాచారాన్ని అందించేందుకు వీలుగా జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. 

కరోనా వైరస్ నేపధ్యంలో  టెలీమెడిషన్ విధానం పటిష్టంగా అమలయ్యేలా చూడాలని సిఎస్ స్పష్టం చేశారు.అంతేగాక టెలిమెడిషన్ విధానంలో డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన 24 గంటల్లోగా సంబంధితులకు మందులు అందేలా చూడాలన్నారు. గ్రామ,వార్డు సచివాలయాల్లో వైయస్సార్ క్లినిక్ లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

గ్రీన్ జోన్లలో వివిధ ఎంఎస్ఎంఇ యూనిట్లన్నీ ప్రారంభించి భౌతిక దూరాన్ని పాటించిస్తూ పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కలెక్టర్లకు స్పష్టం చేశారు.ఈఎంఎస్ఎంఇలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను ప్రకటించిందన్నారు. అంటే 2014-15 సంవత్సరాలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలను క్లియర్ చేస్తారని సీఎస్ పేర్కొన్నారు. 

అంతేగాక ఏప్రిల్ నుంచి జూన్ వరకూ విద్యుత్ చార్జీల రద్దు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని, అలాగే వర్కింగ్ క్యాపిటల్ ను కూడా ఇవ్వడం జరుగుతుందని సిఎస్ తెలిపారు. 3వ దశ లాక్ డౌన్ సమీపిస్తున్న నేపథ్యంలో కంటైన్మెంట్ ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా లాక్ డౌన్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని సిఎస్ స్పష్టం చేశారు.

 

Leave a Comment