ప్రతి గ్రామసచివాలయంలో క్వారంటైన్ వసతి..

ప్రతి గ్రామసచివాలయాన్ని ఒక యూనిట్ గా తీసుకోవాలని, ప్రతి గ్రామసచివాలయంలో కనీసం 10 నుంచి 15 మందికి క్వారంటైన్ వసతి కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. కోవిడ్-19 నివారణ చర్యలపై సీఎం జగన్ మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో, విదేశాల్లో కోవిడ్‌–19 పరిస్థితుల కారణంగా చిక్కుకుపోయిన వారు తిరిగి వస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన విధానంపై సమావేశంలో చర్చించారు. 

వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయాలని, కనీసం లక్ష బెడ్లు సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. అంగన్‌వాడీలు, మెప్మా, పంచాయతీరాజ్‌ ఈ మూడూ కలిసి గ్రామాల్లో కోవిడ్‌-19 క్వారంటైన్‌ చర్యలు చేపట్టాలన్నారు. 

మొబైల్ వాహనాలుగా ఆర్టీసీ బస్సులు..

కనీసం 500 ఆర్టీసీ బస్సులను నిత్యావసరాలను తీసుకెళ్లే మొబైల్‌ వాహనాలుగా మార్చాలని సీఎం ఆదేశించారు. ఇందులోనే వీలైనంత వరకు ఫ్రీజర్లు ఏర్పాటు చేసి పాలు,పెరుగు, గుడ్లు, పండ్లు, లాంటి నిత్యావసరాలను ఏర్పాటు చేయాలన్నారు. కేసుల తీవ్రత ఉన్న క్లస్టర్లలో ప్రజల కదలికలను కట్టడి చేసి నిత్యావసరాల కోసం ఒక వ్యక్తికే పాసు ఇవ్వాలన్నారు. డాక్టరు, ఏఎన్‌ఎం, ఆశాకార్యకర్త,  మందులు కూడా మొబైల్‌ యూనిట్‌కు అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. 

లాక్‌డౌన్‌ పొడిగింపు, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలపై సమీక్ష

కేంద్రహోంశాఖ ఇచ్చిన సూచనల మేరకు ఎక్కడెక్కడ కంటైన్‌మెంట్‌ జోన్లు ఉండాలన్న దానిపై, అక్కడ అనుసరించాల్సిన విధానాలపై విధివిధానాలు తయారు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అనుమతులు ఉన్న దుకాణాల వద్ద పాటించాల్సిన ఎస్‌ఓపీలను ఇవ్వాలని సీఎం తెలిపారు.

మే 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం..

మే 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఈలోగా మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను బలోపేతం చేయాలని సీఎం తెలిపారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో వ్యవసాయ సలహా బోర్డుల ఏర్పాటుపై విధివిధానాలు ఖరారు చేయాలని ఆదేశించారు. వీటిని ఆర్బీకేలకు అనుసంధానం చేయాలన్నారు. 

మే‌ 6న మత్స్యకార భరోసాకు సిద్ధం అయ్యామని అధికారులు తెలిపారు.  రైతు భరోసాకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా ఉంచుతున్నామని, పేరు లేకపోతే దరఖాస్తు చేసుకునేలా ప్రచారం చేస్తున్నామని వెల్లడించారు. 

 

Leave a Comment