ఆక్సిజన్ కోసం ప్రోనింగ్ చేయండి.. కేంద్రం సూచన..!

దేశంలో కరోనా కోరలు చాస్తోంది. మరోవైపు ఆక్సిజన్ కొరత వేధిస్తుంది. ఆక్సిజన్ సరఫరా లేక కరోనా రోగులు మరణిస్తున్నారు. ఇలాంటి సమయంలో కరోనా రోగులకు కేంద్ర ఆరోగ్య శాఖ కొన్ని సూచనలు జారీ చేసింది. శ్వాసను మెరుగుపరుచుకోవడానికి, ఆక్సిజనేషన్ కోసం ప్రోనింగ్ చేయాలని సూచించింది. ముఖ్యంగా ఇంట్లోనే స్వల్ప లక్షణాలతో పాటు శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుందని ఆరోగ్యశాఖ పేర్కొంది.

ఉదరభాగంపై బరువు వేసి బోర్లా పడుకోవడమే ప్రోనింగ్ పోజిషన్ అని, ఇది వెంటిలేషన్ ను మెరుగుపరుస్తుందని ఆరోగ్యశాఖ తెలిపింది. రక్తంలో ఆక్సిజన్ లెవల్ 94 కంటే కిందికి పడిపోయినప్పుడే ఈ పనిచేయాలని సూచించింది. సరైన సమయంలో ప్రోనింగ్ చేస్తే ఎన్నో ప్రాణాలు నిలుపుకోవచ్చని కూడా తెలిపింది..

ప్రోనింగ్ ఎలా చేయాలి?

  • ముందుగా మంచంపై బోర్లా పడుకోవాలి.
  • ఒక మెత్తని దిండు తీసుకుని మెడ కింద భాగంలో ఉంచాలి.
  • ఛాతి నుంచి తొడ వరకు ఒకటి లేదా రెండు దిండ్లను ఉంచుకోవాలి. 
  • మరో రెండు దిండ్లను మోకాలి కింది భాగంలో ఉండేలా చేసుకోవాలి.
  • ఇక ఎక్కువ సమయంలో పడకపై ఉండే రోగులకు రోజంతా ఒకే విధంగా వివిధ రకాల భంగిమల్లో విశ్రాంతి తీసుకోవచ్చని కేంద్ర ఆరోశాఖ సూచిస్తోంది. ఒక్కో స్థానంలో 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు పడుకోవచ్చని తెలిపింది. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  • భోజనం చేసిన తర్వాత గంట వరకు ప్రోనింగ్ చేయవద్దు.
  • సౌకర్యవంతంగా అనిపించినంత వరకు మాత్రమే ప్రోనింగ్ చేయాలి. 
  • వైద్యుల సూచనల ప్రకారం పలు సమయాల్లో రోజులో గరిష్టంగా 16 గంటల వరకు ప్రోనింగ్ చేయవచ్చు. 
  • గుండె సమస్యలు, గర్భిణులు, వెన్ను సమస్యలు ఉన్న వారు ఈ విధానానికి దూరంగా ఉండాలి. 
  • ప్రోనింగ్ సమయంలో దిండ్లను సౌకర్యవంతంగా ఉండేలా ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. 

ప్రయోజనాలు..

  • ప్రోనింగ్ ద్వారా శ్వాసమార్గం ద్వారా గాలి ప్రసరణ మెరుగు పడుతుంది. 
  • ఆక్సిజన్ స్థాయిలు 94 శాతం కంటే తక్కువగా పడిపోతున్న సమయంలోనే ప్రోనింగ్ అవసరం.
  • ఐసోలేషన్ లో ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయిలు, రక్తంలో చక్కెర స్థాయిలను పరిశీలించుకోవాలి. 
  • ప్రోనింగ్ చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడుకోవచ్చు. 

 

Leave a Comment