మిల్కాసింగ్ వ్యక్తిత్వం భావితరాలకు ఆదర్శం : సీఎం జగన్

‘ఫ్లయింగ్ సిక్కు’ గా ప్రసిద్ధి చెందిన భారత అథ్లెట్ మిల్కాసింగ్(91) కరోనా కారణంగా శుక్రవారం మరణించారు. ఆయన మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. దేశం గొప్ప క్రీడాకారుడిని కోల్పోయిందని వ్యాఖ్యానించారు. ఆయన ఉత్తేజకరమైన వ్యక్తిత్తం లక్షలాది మంది భారతీయుల గుండెల్లో స్థానాన్ని సంపాదించిందన్నారు. అతడి మరణం తనకు తీరని లోటన్నారు. 

కొద్ది రోజుల క్రితమే తాను మిల్కాసింగ్ జీతో మాట్లాడనని, ఇది తమ చివరి సంభాషణ అని తనకు తెలియదని ప్రధాని మోడీ భావోద్వేగానికి లోనయ్యారు. చాలా మంది అథ్లెట్లు అతడి జీవిత ప్రయాణాన్ని స్ఫూర్తిగా తీసుకుంటారన్నారు. ఆయన కుటుంబానికి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతని అభిమానులకు తన సంతాపం తెలియజేశారు. మిల్కాసింగ్ తో కలిసి ఉన్న ఫొటోను ప్రధాని ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. 

సీఎం జగన్ సంతాపం:

మిల్కాసింగ్ మృతి పట్ల ఏపీ సీఎం జగన్ సంతాపం తెలియజేశారు. మిల్కాసింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రపంచ అథ్లెటిక్స్ లో మిల్కాసింగ్ చెరగని ముద్ర వేశారని, ఆయన వ్యక్తిత్వం భావితరాలకు ఆదర్శమని సీఎం జగన్ పేర్కొన్నారు. 

కాగా, కరోనాతో బాధపడుతూ మే 20న ఆస్పత్రిలో చేరిన మిల్కాసింగ్ కు మూడు రోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ రావడంతో ఆయనను నాన్ కోవిడ్ ఐసీయూ సెంటర్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. తండ్రి మరణించిన విషయాన్ని మిల్కాసింగ్ కుమారుడు, దిగ్గజ గోల్ఫర్ జీవ్ మిల్కా సింగ్ ధ్రువీకరించారు. కాగా, మిల్కా సింగ్ భార్య, ఇండియన్ వాలీబాల్ జట్టు మాజీ కెప్టెన్ అయిన నిర్మల్ సైనీ కౌర్ కరోనాతో ఈనెల 14న మరణించారు. 

  

 

Leave a Comment