రేట్లు షాక్ కొట్టించేలా ఉండాలి : సీఎం జగన్

మద్యం నియంత్రించేందుకు ధరలు 75 శాతం పెంచామని సీఎం జగన్ స్పష్టం చేశారు. కోవిడ్-19 నివారణ చర్యలపై చేపట్టిన సమీక్షలో మద్యం ధరలపై సీఎం జగన్ సమావేశంలో చర్చించారు. లిక్కర్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఏం జరుగుతోంది అన్న విషయాన్ని టీవీ ఛానళ్లు, పేపర్లు చూపిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో 25 శాతం ధరలు పెంచి మద్యం వినియోగం తగ్గించాలనుకుంటే ఢిల్లీలో ఏకంగా 70 శాతం పెంచారన్నారు. అందుకే రాష్ట్రంలో 75 శాతం పెంచి.. గట్టి చర్య తీసుకున్నామని తెలిపారు. 

దుకాణాల సంఖ్య కూడా 15 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల్లో 33 శాతం దుకాణాలు తగ్గించినట్టు అవుతుందన్నారు. ఇప్పటికే 20 శాతం దుకాణాలు తగ్గించామన్నారు. 

ప్రతి షాపు వద్ద ఇంతకు ముందు ప్రైవేటు రూమ్స్‌ (పర్మిట్‌ రూమ్స్‌) పెట్టారని, మన ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 43 వేల బెల్టుషాపులను కూడా రద్దు చేసిందన్నారు. గ్రామాల్లో బెట్లుషాపులు పర్మినెంట్‌గా లేకుండా ఉండాలంటే.. అది లాభాపేక్ష లేనప్పుడే జరుగుతుందన్నారు. అందుకనే ప్రైవేటు వారికి కాకుండా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తుందన్నారు. 

లేకపోతే సేల్స్‌ను ప్రోత్సహించడం కోసం ప్రైవేటు వాళ్లు బెల్టుషాపులను ప్రోత్సహిస్తారని తెలపారు. మద్యం విక్రయించే వేళలను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంట వరకూ పరిమితం చేశామన్నారు. అందులో భాగంగానే ఈ 75 శాతం ధరల పెంపు నిర్ణయం కూడా తీసుకున్నామన్నారు. 

రేట్లు షాక్‌ కొట్టించే రేట్లు ఉండాలని నిశ్చయించుకున్నామన్నారు. రానున్న రోజుల్లో మద్యం అమ్మకాలు తగ్గించుకుంటూ పోతామని స్పష్టం చేశారు. పక్క రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా, రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీని అడ్డుకోవడం కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యతగా తీసుకోవాలన్నారు. ద్యం తయారీ, ఇసుక అక్రమాలు ఎట్టి పరిస్థితులోనూ ఉండకూడదని స్పష్టం చేశారు. ఇసుక మాఫియా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదని, ఈ అంశాలను దగ్గరుండి తాను స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు.

Leave a Comment