ఎంత చేసినా..కరోనా తగ్గదు..కలిసి జీవించాల్సిందే 

కోవిడ్ – 19 టెస్టుల్లో దేశంలో నెంబర్ వన్ ఏపీ 

మరణాల రేటు 2 శాతం లోపే..

సీఎం జగన్

కోవిడ్-19 టెస్టుల పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని సీఎం జగన్ తెలిపారు. మంగళవారం కోవిడ్-19 నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రతి పది లక్షల జనాభాకు 2500కి పైగా టెస్టులు చేస్తున్నామని, ఇది ఒక రికార్డని అన్నారు. నెల కింద రాష్ట్రంలో స్విమ్స్‌ తప్ప మరో చోట టెస్టింగ్‌ ఫెసిలిటీ లేదని, అది కూడా 2 రోజుల తర్వాత ఫలితాలు వచ్చేవని చెప్పారు. 

కానీ ఇవాళ 11 జిల్లాల్లో 12 టెస్టింగ్‌ ల్యాబ్స్‌ ఉన్నాయని, ట్రూనాట్‌ కిట్లు కూడా అన్ని ఆస్పత్రుల్లో ఉన్నాయని పేర్కొన్నారు. అందరూ కలిసి ఈ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకున్నామన్నారు. గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్ల రూపంలో రాష్ట్రంలో బలమైన నెట్‌వర్క్‌ఉందన్నారు. కోవిడ్‌ను ఎదుర్కొనే విషయంలో ఇతర రాష్ట్రాల కన్నా భిన్నంగా పని చేయగలిగామని తెలిపారు. 

కరోనాతో కలిసి జీవించాల్సిందే..

ఎంత చేయాలనుకున్నా కోవిడ్‌ అనేది ఎక్కడో చోట కనిపిస్తుందని, కోవిడ్‌తో కలిసి జీవించాలన్నది వాస్తవమైన విషయమని చెప్పారు. దేశంలో, రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఇది కనిపిస్తుందన్నారు. దగ్గడమో, తుమ్మడమో చేస్తే.. అది పక్కవాళ్లకు వ్యాపిస్తుందన్నారు. కోవిడ్‌ అన్నది జీవితంలో భాగం అవుతుందని తెలిపారు. 

మరణాల రేటు 2 శాతం లోపే..

కరోనా వైరస్‌ కారణంగా మరణాల రేటు కేవలం 2 శాతం లోపే ఉందన్నారు. వయస్సు ఎక్కువగా ఉన్న వారు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారి పైనే ఈ వైరస్‌ ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు. మన ఇంట్లో ఉన్న మన పెద్దవారిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

లక్షకు పైగా వలస కూలీలు రావచ్చు..

ప్రతి గ్రామంలో 10 క్వారంటైన్‌ బెడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులు తిరిగి వస్తున్నారని, లక్షకు పైగా రాష్ట్రానికి వలస కూలీలు వస్తారని అంచనా వేశామని సీఎం తెలిపారు. వివిధ దేశాల నుంచి కూడా రాష్ట్రానికి చెందిన వారు రానున్నారన్నారు. వీటన్నింటినీ డీల్‌ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రతి గ్రామంలో 10 మందికైనా సరి పడే విధంగా క్వారంటైన్‌ సదుపాయాన్ని కల్పించాలన్నారు. దాదాపు 11వేలకుపైగా ఉన్న గ్రామ సచివాలయాల్లో కనీసంగా లక్ష మందికి క్వారంటైన్‌ సదుపాయాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. 

ప్రతి గ్రామ సచివాలయంలో టెలి మెడిసిన్, దిశ, అవినీతి నిర్మూలన, వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన నెంబర్లు ఉండాలన్నారు. టెలి మెడిసిన్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుందని అధికారులు చెబుతున్నారన్నారు.  కాల్‌ చేసిన వారికి ప్రిస్క్రిప్షన్‌ ఇచ్చిన తర్వాత ఆ వివరాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితోపాటు, కలెక్టర్‌కూ వస్తాయన్నారు.

Leave a Comment