‘మీరు లేకపోతే నేను లేను’.. ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు సఫలమయ్యాయి. దీంతో పీఆర్సీ సాధన సమితి సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. జగన్ సర్కార్ తమ కోరికలను మన్నించడంతో సమ్మెలోకి వెల్లడం లేదని సాధన సమితి నేతలు ప్రకటించారు. చర్యలు సఫలం కావడంతో ఉద్యోగ సంఘాల నేతలు ఆదివారం సీఎం జగన్ తో కలిశారు.. ఈ సందర్భంగా సీఎం జగన్ కి ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా తమకు మేలు చేశారని పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా ఉద్యోగుల్ని ఉద్దేశించి సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల సహకారం ఉంటేనే ఏదైనా సాధ్యం అవుతుందని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఉద్యోగులకు చేయగలిగినంత సహకారం చేస్తున్నామని చెప్పారు. డిమాండ్ల విషయంలో ఎవరూ భావోద్వేగానికి గురి కావద్దని సూచించారు. తాను మనస్ఫూర్తిగా నమ్మేది ఒకటేనని, మీరు లేకపోతే తాను లేనని సీఎం జగన్ భావోద్వేగానికి గురయ్యారు.  

ఇంకా ఏమన్నారంటే..‘ఈ ప్రభుత్వం మీది. ఈ రోజు నేను మంచి చేయడానికి నాలుగు అడుగులు ముందుకు వేయగలుగుతున్నాను అంటే మీ సహకారంతో చేయగలుగుతున్నాను. ఆర్థిక పరిస్థితుల వల్ల, కరోనా ప్రభావం వల్ల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీకు తెలుసు. ఈ నేపధ్యంలో మీరు ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోవచ్చు. కానీ ఎంతమేర మేలు చేయగలుగుతామో అన్నిరకాలుగా చేశాం. రాజకీయాలు ఇందులోకి వస్తే.. ఉన్న వాతావరణం చెడిపోతుంది.’

‘ఐ.ఆర్‌. ఇచ్చిన 30 నెలల కాలానికి గానూ, 9 నెలల ఐ.ఆర్‌ను సర్దుబాటు నుంచి మినహాయింపు ఇవ్వడం వల్ల రూ.5400 అదనంగా భారం పడుతోంది. హెచ్‌.ఆర్‌.ఏను జనవరి నుంచి వర్తింపజేయడం వల్ల అదనంగామరో రూ.325 కోట్లు భారం పడుతోంది. మొత్తం రూ.5725 కోట్లు అదనపు భారం పడుతోంది. ఈ అదనంగా భారం పడేది కాకుండా ప్రతి సంవత్సరం రికరింగ్‌ వ్యయం రూపేణా మార్పు చేసిన హెచ్‌.ఆర్‌.ఏ వల్ల రూ.800 కోట్లు, అడిషనల్‌క్వాంటమ్‌ ఆఫ్ పెన్షన్ వల్ల మరో రూ450 కోట్లు, సీసీఏ రూపంలో మరో రూ.80 కోట్లు ఈ మొత్తం కలిపితే రూ.1330 కోట్లు భారం పడుతోంది. ఇంతకముందు పీఆర్సీ ప్రకారం రూ.10,247 కోట్లు ప్రతి సంవత్సరం పెరుగుతుందనుకున్నామో.. దానికి ఈ రూ.1330 కోట్లు రికరింగ్ అంటే మొత్తంగా రూ.11,577 కోట్లు  ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం రికరింగ్‌గా భారం పడుతోంది.’

‘ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా… రూ.5725 కోట్లు కూడా ఏదైతే మనం ఒన్ టైం ఇస్తున్నామో… ఇది మీ పోస్ట్ రిటైర్మెంట్ మీకు ఇస్తున్నాం. మీరు ఈ ప్రతిపాదనలకు అంగీకరించినందుకు ధన్యవాదాలు. ఇంత పెద్ద మొత్తం ఒక్కసారి  ఇవ్వాలంటే చాలా కష్టమైన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. మనం ఒక్కటిగా కలిసి ముందుకు సాగుదాం.’

‘కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నాం. రోస్టర్ విధానంలో ఎవరిని నియమించామో వాళ్లందరి పట్ల కూడా సానుకూలంగా ఉండమని ఆదేశాలు జారీ చేశాం.  దీనిపై ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాం. 30వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇస్తున్నాం. ఈ జూన్ నాటికి ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తున్నాం. ఎక్కడైనా కూడా తక్కువ చేస్తున్నాం అనిపించినప్పుడు.. అలా ఉండకూడదని కొన్ని చర్యలు తీసుకున్నాం.

దీంట్లో భాగంగానే రిటైర్‌మెంట్‌వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం. 24 నెలల జీతం రూపేణా మరోచోట మంచి జరుగుతుందనే ఉద్దేశంతోమీరు అడగకపోయినా మేం చేశాం. దానివల్ల ఇక్కడ కొద్దోగొప్పో అనుకున్న మేరకు న్యాయం చేయలేకపోతాం అన్న పరిస్థితి నుంచి కనీసం ఎక్కడో ఒక చోట న్యాయం జరుగుతుందన్న మంచి ఆలోచన నుంచి ఈ నిర్ణయం తీసుకున్నాం. వాళ్లకు మేలు జరగాలనే ఇది చేశాం. అలాగే ఎంఐజీ ఇళ్లస్థలాల విషయంలోకూడా మీరు అడగకపోయినా నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం ఎప్పుడూ మీతో ఉంటుంది. అది ఎప్పుడూ మనసులో పెట్టుకొండి. ఏ సమస్యపైనైనా చర్చకు సిద్ధం. మీరు చెప్పేవి వినడానికి ఈప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.’ అంటూ సీఎం జగన్ ఉద్యోగులతో చెప్పారు.  

 

Leave a Comment