నెల్లూరులో మగాళ్లతో మహిళా పోలీసుల యూనిఫాం కొలతలు..!

నెల్లూరులో పోలీసులు తీరుపై విమర్శలు వస్తున్నాయి. మహిళా పోలీసుల యూనిఫాం కుట్టించేందుకు పురుష టైలర్లతో కొలతలు తీయించారు. దీంతో మహిళా కానిస్టేబుళ్లు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారుల తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నెల్లూరులోని పోలీస్ కవాతు మైదానంలో ఉన్న ఉమేశ్ చంద్ర కాన్ఫరెన్స్ హాలులో సోమవారం సచివాలయ మహిళా పోలీసులకు యూనిఫాం కొలతలు తీసుకున్నారు. ఆత్మకూరు, కావలి డివిజన్ల నుంచి మహిళా పోలీసులు హజరయ్యారు. వీరి కొలతలు తీసేందుకు మహిళ టైలర్ ని కాకుండా పురుష టైలర్లను పెట్టారు. అక్కడ కొందరు మహిళా పోలీసులు కూడా ఉన్నారు. అయినా పురుషుడు కొలతలు తీసుకోవడంతో వారు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల తీరు వివాదాస్పదం అయింది. వెంటనే పోలీసు ఉన్నతాధికారులు స్పందించి కొలతలు తీసుకుంటున్న పురుషులను తప్పంచి మహిళలతో కొలతలు తీయించారు. మహిళా టైలర్లు లేని కారణంగా యూనిఫాం కొలతలు పురుషులతో తీయించాల్సి వచ్చిందని నెల్లూరు ఏఎస్పీ వెంకటరత్నం తెలిపారు. యూనిఫాం బాధ్యతలను ఓట్ సోర్సింగ్ కి అప్పజెప్పామని, ఒక పురుషుడు కొలతలు తీసినట్లు తెలిసిన వెంటనే దానిని సరిదిద్దామని అన్నారు. అనుమతిలేని ప్రదేశంలోకి ప్రవేశించి ఫొటోలు తీసిన గుర్త తెలియని వ్యక్తిపైనా చట్టపరమైన చర్యలకు ఎస్పీ ఆదేశించారు. 

  

Leave a Comment