పోలీసులంటే భయం అవసరం లేదు : సీఎం జగన్

పోలీసులంటే సేవకులని, వారిని చూసి భయపడాల్సిన అవసరం లేదని సీఎం జగన్ పేర్కొన్నారు. పౌరులకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో ఏపీ పోలీస్‌ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ‘ఏపీ పోలీస్‌ సేవ (సిటిజెన్‌ సర్వీసెస్‌ అప్లికేషన్‌)  యాప్‌’ ను క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ ఆవిష్కరించారు. పోలీస్ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, వారికి రోజంతా అందుబాటులో ఉండే విధంగా ఈ యాప్ రూపొందించడం జరిగిందని సీఎం జగన్ తెలిపారు. ఈ యాప్ ద్వారా పౌరులకు ఆరు విభాగాల్లో 87 రకాల సేవలు అందుతాయన్నారు. 

యాప్ ప్రయోజనాలు..

  •  ఇళ్ల భద్రత మొదలు ఏ అవసరం కోసం అయినా యాప్‌ ఉపయోగపడుతుంది. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం చాలా తగ్గుతుంది.
  • సర్టిఫికెట్‌ కావాలన్నా, డాక్యుమెంట్లు పోయినా, ఏవైనా లైసెన్సులు రెన్యువల్‌ చేయించుకోవాలన్నా, ఎన్‌ఓసీ కావాలన్నా పోలీస్‌ స్టేషన్‌కు పోవాల్సిన అవసరం లేదు.
  • మొబైల్‌ యాప్‌లోనే ఫిర్యాదు చేసుకోవచ్చు. కేసు నమోదు చేస్తే, ఎఫ్‌ఐఆర్‌ కూడా పొందవచ్చు. ఆ తర్వాత ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం ఎస్‌ఎంఎస్‌ ద్వారా అందుతుంది.

ప్రధానంగా ఏయే విభాగాలు?:

  •  మహిళల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ 12 మాడ్యూల్స్‌ చేర్చారు. దిశ యాప్‌ కూడా అనుసంధానం చేశారు. 
  •  రోడ్‌ సేఫ్టీకి సంబంధించి కూడా 6 మాడ్యూల్స్‌ ఉన్నాయి. చిన్న ప్రమాదం జరిగినా, దాన్ని రిపోర్టు చేయడంతోపాటు, ఆస్పత్రికి తరలించే వరకు పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది.
  •  సైబర్‌ నేరాలకు సంబంధించి కూడా దాదాపు 15 మాడ్యూల్స్‌ ఉన్నాయి. ఆ నేరాలకు సంబంధించి ఎవరికి ఏ సమస్య ఉన్నా యాప్‌ ఉపయోగపడుతుంది.
  • చివరకు సోషల్‌ మీడియాలో వచ్చే సమాచారంలో వాస్తవం ఏమిటన్నది కూడా తెలుసుకోవచ్చు. ‘ఫ్యాక్ట్స్‌ చెక్‌’ అన్న ఫీచర్‌ కూడా ఇందులో ఉంది.
  • పోలీసులే సరైన సమాచారం ఇచ్చే సోషల్‌ మీడియా కూడా ఈ యాప్‌లో అందుబాటులో ఉంటుంది.
  • గ్రామ, వార్డు సచివాలయాల్లో గ్రామ పోలీసులను కూడా ఇందులో అనుసంధానం చేశారు. 

అసలు ఏమిటి ఈ యాప్‌?:

దేశంలోనే తొలిసారిగా ఏపీ పోలీస్‌ శాఖ ఈ యాప్‌ను రూపొందించింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లను అనుసంధానిస్తూ, పౌరులు తమ అవసరాల కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లే అవసరం లేకుండా, వారు ఆరు విభాగాలలో మొత్తం 87 రకాల సేవలు పొందేలా ‘ఏపీ పోలీస్‌ సేవ’ యాప్‌ అందుబాటులోకి వస్తోంది.

పోలీసు స్టేషన్‌ ద్వారా లభించే అన్ని రకాల సేవలను ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా పొందవచ్చు. అన్ని నేరాలపైనా ఫిర్యాదు చేయొచ్చు. అంతే కాకుండా ఆ ఫిర్యాదులకు రసీదు కూడా పొందే విధంగా  యాప్‌ రూపొందించారు. ఒక్క మాటలో చెప్పాలంటే పోలీసు వ్యవస్థలో ఈ యాప్‌ ఒక విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుంది.

‘ఏపీ పోలీస్‌ సేవ’ యాప్‌ నుంచే వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అత్యవసర సమయాల్లో వీడియో కాల్‌ చేస్తే పోలీస్‌ కంట్రోల్‌ రూంకు వెంటనే సమాచారం వెళ్తుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే సమాచారాన్ని కూడా నిర్థారించుకునే సౌకర్యం ఇందులో ఉంది. ఇంకా ఈ యాప్‌లో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 12 మాడ్యూల్స్‌ ఉన్నాయి.

 

Leave a Comment