సమస్య ఉంటే వాలిపోయేవాడే ఖాకీ.. దట్ ఈజ్ పోలీస్..!

సమస్య వస్తే తమకెందుకులే అన్న వాళ్లే ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. పక్క వారు ఏమైనా పర్వాలేదు.. అంటూ చూసి చూడనట్లు వెళ్లిపోతున్నారు.. అయితే సమస్య వచ్చినప్పుడు ఎవరు ముందుకొచ్చినా.. రాకపోయినా..పోలీసులు ఎప్పుడు ముందుంటారని నిరూపించారు.. ఈ ఇద్దరు పోలీసులు.. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఆ వీడియోలో ఏముందంటే.. ఒక వ్యక్తి తన కుటుంబంతో కలిసి కారులో వెళ్తున్నాడు. ఆ సమయంలో రోడ్డుపై సడెన్ గా కారు ఆగిపోతుంది. ముందు కారు నడుపుతున్న వ్యక్తి దిగి సాయం కోసం రోడ్డుపై వెళ్లే వారిని అడిగాడు. ఎవరూ స్పందించలేదు. ఇక కారులోకూర్చున్న మహిళ, చిన్న పాప కారును ముందుకు తోసేందుకు ప్రయత్నిస్తారు. అప్పుడు కూడా సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రారు. కొందరేమో చూసుకుంటూ వెళ్లిపోతారు. ఇక చివరికి మరో ఇద్దరు చిన్నారులు వారికి సాయంగా కారు తోస్తుంటారు.. అంతలో ఇద్దరు పోలీసులు కారు వద్ద ఆగి విషయం తెలుసుకుంటారు. ఇద్దరు కారును ముందుకు తోసి వారికి సాయం చేస్తారు. కారు స్టార్ట్ అవుతుంది. దీంతో ఆ చిన్నారితో పాటు ఆ కుటుంబం పోలీసులకు ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోతారు..

ఈ వీడియోను తెలంగాణ స్టేట్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘సహాయం అవసరమని, అభ్యర్థించినా సరే సంబంధం లేని వారికి నేనెందుకు సహాయపడాలనో, లేదా నా చేతులకు మట్టి అంటుకుంటుందనో చాలావరకు ముందుకు రాని జనం.. ఇదీ ప్రస్తుత వైనం.. అడిగినా – అడగకపోయినా.. ఎవరు ముందుకు వచ్చినా – రాకపోయినా, సమస్య కంటబడ్డ మరుక్షణం మీ సహాయార్థమై వాలిపోయే వాడొకడుంటాడు.. వాడే ఖాకీ’ అంటూ క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు పోలీసుల పనితీరును ప్రశంసిస్తుంటే.. కొందరు ఈ వీడియోను ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు. అందరు ఖాకీలు ఇలా ఉండరు అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. 

Leave a Comment