తల్లి బతికుండగానే పెద్దకర్మ.. అయినా కొడుకును క్షమించిన అమ్మ..!

తల్లిని మించిన ప్రేమమూర్తి ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో అమ్మప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేది. అలాంటి అమ్మ మీద ఈ రోజుల్లో కనికరం లేకుండా పోతుంది. కేవలం డబ్బే ప్రధానంగా జీవిస్తున్నారు. వృద్ధాప్యంలో కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న కొడుకు.. ఆమె సంపాదించే పదో పరకో కూతుర్లకు పెడుతుందన్న అక్కసుతో.. కన్న తల్లి బతికుండగానే పెద్ద కర్మ చేయాలని చూశాడు. ఈమేరకు తన తల్లి పేరుతో సంతాప కార్డు కూడా ముద్రించాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. 

జిల్లాలోని కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన వారణాశి పోశమ్మకు ఇద్దరు కొడుకులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. అదరికీ పెళ్లిళ్లు చేసింది. ప్రస్తుతం పోశమ్మ తన చిన్న కొడుకు వద్ద ఉంటుంది. వృద్ధాప్యంలోనూ కూలి పనులకు వెళ్తోంది. అయితే కూలి చేసిన సంపాదించిన వాటిని కూడా కూతుళ్లకు పెడుతుందని తల్లి మీద అక్కసు పెంచుకున్నాడు ఆమె పెద్ద కొడుకు యాదిగిరి.. ఈక్రమంలో తన తల్లి చనిపోయిందని, పెద్ద కర్మ చేస్తున్నామని కార్డు ప్రింట్ చేయించాడు. వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఈ విషయం తల్లికి తెలియడంతో కొడుకు నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు యాదగిరిని పిలిచి మందలించారు. పోలీస్ స్టేషన్ లో తల్లికి క్షమాపణలు చెప్పించారు. అంతే ఆ తల్లి మనసు కరిగిపోయింది. తమ కుటుంబ సభ్యులు కలిసి మాట్లాడుకుంటామని స్టేషన్ నుంచి కొడుకుతో వెళ్లిపోయింది. అదీ అమ్మంటే..

Leave a Comment