ఫుల్లుగా మందేసి తూలుతూనే పది పరీక్షల ఇన్విజిలేషన్ డ్యూటీ..!

బాధ్యతగా ఉండాల్సిన ఉపాధ్యాయుడే.. బాధ్యత మరిచాడు. పది పరీక్షల ఇన్విజిలేషన్ డ్యూటీకి ఫుల్లుగా తాగొచ్చాడు. ఎగ్జామ్ సెంటర్ లో తూలుతూనే విధులు నిర్వహించాడు. బ్రీతింగ్ ఎనలైజర్ టెస్ట్ చేస్తే.. అంతా షాకయ్యారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. 

హుజూరాబాద్ లోని రాంపూర్ జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలకు పీఈటీ అయిన రవి కుమార్ కు ఇన్విజిలేషన్ డ్యూటీ వేశారు. మంగళవారం ఈ సెంటర్ లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు డీఈవో జనార్ధన్ రావుకు సమాచారం అందింది. దీంతో డీఈవో వెంటనే ఎగ్జామ్ సెంటర్ కు చేరుకున్నారు. 

ఎగ్జామ్ హాలులో ఇన్విజిలేషన్ డ్యూటీ చేస్తున్న రవి కుమార్ తూలుతూ నడుస్తుండటంతో ఆయనపై డీఈవోకు అనుమానం వచ్చింది. వెంటనే స్థానిక పోలీసులను పిలిపించారు. పోలీసులు ఇన్విజిలేటర్ కు బ్రీతింగ్ ఎనలైజర్ పరీక్ష చేశారు. మద్యం స్థాయి 112 శాతం ఉన్నట్లు వచ్చింది. ఇన్విజిలేటర్ రవి కుమార్ మద్యం తాగినట్లు నిర్ధారణ కావడంతో డీఈవో ఆయన్ను సస్పెండ్ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌ తో డిపార్ట్‌మెంటల్‌ అధికారిని విధుల నుంచి తొలగించారు.

 

 

Leave a Comment