‘లోపం మీలోనా? మీ నీడలో ఉన్న వ్యవస్థలోనా?’ – జగన్ సర్కార్ పై పవన్ కళ్యాణ్ విమర్శలు..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు.  రాష్ట్రంలో గత రెండేళ్ల కాలంలో 100కు పైగా దేవాలయాలపై దాడులు జరిగాయని, రథాలు దగ్ధాలు, దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆరాచకంపై మాట్లాడితే ప్రతిపక్షాలు ఈ రాష్ట్రంలో రాజకీయ గెరిల్లా వార్ ఫేర్ నడిపిస్తున్నాయని సీఎం జగన్ చెప్పడం బాధ్యత నుంచి తప్పించుకునే విధంగా ఉందని విమర్శించారు. 

సీఎం స్థాయి వ్యక్తి ఆధారాలు లేకుండా మాట్లాడితే ప్రజలు హర్షించరన్నారు. ఆయన తలుచుకుంటే హైకోర్టు సీజేలు, న్యాయమూర్తులు క్షణంలో బదిలీ అవుతారని చెప్పారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, 115 మంది ఐపీఎస్ లు, మరో 115 మంది అదనపు ఎస్పీలు, వేలాది మంది పోలీసు సిబ్బంది ఉన్నా.. విగ్రహాలను ధ్వంసం చేసే వారిని పట్టుకోలేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. 

‘నిస్సాహాయుడైన డాక్టర్ సుధాకర్ పైన, సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వం మీద పోస్టులు పెట్టేవారిపై అత్యుత్సాహంతో కేసులు పెట్టే పోలీసులు దేవుడి విగ్రహాలను ధ్వంసం చేసే వారిని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు.. ఊరికో వాలంటీర్ చొప్పున 2.60 లక్షల మందిని నియమించారు.. వారు కూడా సమాచారం ఇవ్వలేకపోతున్నారా? ఎక్కడ ఉంది లోపం? మీలోనా? మీ నీడలో ఉండే వ్యవస్థలోనా?’ అంటూ పవన్ ప్రశ్నించారు.    

Leave a Comment