షాకింగ్ స్టడీ.. పారాసెటమాల్ తో గుండెపోటు వచ్చే ఛాన్స్..!

పారాసెటమాల్..ఈ టాబ్లెట్లు ప్రతి ఇంట్లోను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో ఉంటాయి.. మనకు కొద్దిగా జ్వరంగా అనిపించినా.. బాడీ పెయిన్స్ ఉన్నా ఓ టాబ్లెట్ ని వేసుకుంటాము..కొందరు రోజుకు మూడు సార్లు కూడా దీనిని మింగుతారు.. అయితే పారాసెటమాల్ గురించి ఓ షాకింగ్ విషయం తెలిసింది. దీనిని రోజూ అధికంగా వాడితే రక్తపోటు పెరగడంతో పాటు, గుండె పోటు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. గుండెపోటు, పక్షవాతం ఉన్న వారు పారాసెటమాల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. 

యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్ బర్గ్ లోని నిపుణులు అధిక రక్తపోటు ఉన్న 110 మంది రోగులపై ఈ అధ్యయనం నిర్వహించారు. వీరికి ఒక గ్రాము పారాసెటమాల్ ను రోజుకు నాలుగు సార్లు ఇచ్చారు. నాలుగు రోజుల్లో వీరిలో రక్తపోటు గణనీయంగా పెరిగినట్లు గుర్తించారు. ఇలాంటి వారిలో గుండెపోటు లేదా స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు 20 శాతం పెరిగినట్లు తేలింది.

బ్రిటన్ లో ప్రతి 10 మందిలో ఒకరికి దీర్ఘకాలిక నొప్పి కోసం పారాసెటమాల్ ని ప్రతిరోజూ సూచిస్తారు. అక్కడ ముగ్గురిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఇబుప్రొఫెన్ వంటి మందులను ఉపయోగించడం వల్ల రక్తపోటు పెరుగుతుందని ఎడిన్ బర్గ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ వెబ్ అన్నారు. ఆ మందులను మానేయాలని రోగులకు చెప్పేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, పారాసెటమాల్ ని కూడా ఎక్కువగా వాడొద్దని చెప్పాల్సి వస్తోందని తెలిపారు.

 వైద్యులు తక్కువ మోతాదులో పారాసెటమాల్ రోగులకు సూచించాలని, దశల్లో దాని మోతాదును పెంచాలని సిఫార్స్ చేస్తున్నామని ప్రొఫెసర్ అన్నారు. అయితే అప్పుడప్పుడు పారాసెటమాల్ తీసుకునే వ్యక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ ఇయాన్ మాకింటైర్ అన్నారు. అయితే దీర్ఘకాలికంగా దీనీని ఉపయోగించడం మంచిదికాదని ఆయన సూచించారు. ముఖ్యంగా లివర్, కిడ్నీ సమస్యలు ఉన్న వారు, బరువు తక్కువగా ఉన్నవారు, మద్యం ఎక్కువగా సేవించే వారు పారాసెటమాల్ ని అధికంగా వేసుకోకూడదు.. 

Leave a Comment