‘డిజిటల్ బెగ్గర్’.. మెడలో క్యూఆర్ కోడ్ తో భిక్షాటన..!

ఇప్పుడు దేశంలో అన్ని డిజిటల్ మయం అవుతున్నాయి. డిజిటల్ కమ్యూనికేషన్, డిజిటల్ బిజినెస్, డిజిటల్ పేమెంట్స్, డిజిటల్ ఎడ్యుకేషన్ ఇలా చాలా వరకు పనులు డిజిటల్ రూపంలో జరుగుతున్నాయి. ఇక డిజిటల్ పేమెంట్స్ అయితే ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.జేబులో డబ్బులు లేకపోయినా.. చేతిలో ఫోన్ ఉంటే చాలు..పేమెంట్స్ చేసేయవచ్చు. ఇప్పుడు పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి తోపుడు బండ్ల వరకు డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటున్నాయి..  

తాజాగా భిక్షాటన చేసేవారు సైతం డిజిటల్ రూపంలోకి మారిపోతున్నారు.. భిక్షాటన చేసే వారు ఎవరైనా డబ్బులు అడిగితే చిల్లర లేదని సమాధానం చెబుతుంటారు.. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న ఓ భిక్షగాడు ‘డిజిటల్ భిక్షాటన’ ప్రారంభించాడు. మెడలో యూపీఐ క్యూఆర్ కోడ్ తగిలించుకుని స్కాన్ చేయాలని కోరుతున్నాడు. 

బిహారలోని బెట్టియా రైల్వే స్టేషన్ లో 40 ఏళ్ల రాజు పటేల్ అనే వ్యక్తి రోజూ భిక్షాటన చేస్తుంటాడు. డబ్బులు లేవని చెప్పే వారికి డిజిటల్ గా పేమెంట్ చేసే ఆప్షన్ కూడా ఇస్తున్నాడు. దాని కోసం ఫోన్ పే క్యూఆర్ కోడ్ ను మెడలో వేసుకుని ఓ ట్యాబ్లెట్ ని కూడా తన వద్ద పెట్టుకున్నాడు. ఇది చూసిన వారు షాక్ అవుతున్నారు. భిక్షాటన కోసం కూడా క్యూఆర్ కోడ్ వాడుతున్నారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ డిజిటల్ భిక్షాటనలో తనకు ప్రధాని మోడీ ‘డిజిటల్ ఇండియా’ ఆదర్శం అని రాజు పటేల్ అంటున్నాడు. ఇంకా బ్యాంక్ అకౌంట్ కోసం పాన్ కార్డ్ కూడా తీసుకున్నట్లు చెప్పాడు.    

Leave a Comment