రష్యాలో ఒక్కరోజులోనే 1000 దాటిన కరోనా మరణాలు..!

కరోనా సెకండ్ వేవ్ ప్రపంచ వ్యాప్తంగా ఎంత బీభత్సం సృష్టించిందో తెలిసిందే.. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతోంది. అయితే రష్యాలో మాత్రం కరోనా మహమ్మారి ఇంకా తగ్గడం లేదు. రోజురోజుకు కేసులు, మరణాలు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి మొదటిసారిగా ఇక్కడ గడచిన 24 గంటల్లో 1000కి పైగా మరణాలు నమోదయ్యాయి. దీన్ని బట్టి అక్కడ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 

24 గంటల్లో 33,208 కొత్త కేసులు రాగా, 1002 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. కేసులు, మృతుల సంఖ్య పెరగడం వరుసుగా ఇది మూడో రోజు. మొత్తంగా రష్యాలో ఇప్పటివరకు 80 లక్షల కేసులు నమోదుకాగా.. 2,22,315 మరణాలు సంభవించాయి. ఇక కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశాల జాబితాలో రష్యా ఐదో స్థానంలో ఉంది. తొలి స్థానాల్లో అమెరికా, బ్రెజిల్, భారత్, మెక్సికో ఉన్నాయి. 

కరోనా అరికట్టేందుకు వ్యాక్సినేషన్ చాలా ముఖ్యం. చాలా దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా జరుగుతోంది. అయితే రష్యాలో మాత్రం వ్యాక్సినేషన్ కార్యక్రమం మందకొడిగా సాగుతోంది. అక్కడ కోవిడ్ నిబంధనలు సైతం కఠినంగా అమలు చేయడం లేదు. రష్యాలో ఇప్పటి వరకు 31 శాతం జనాభాకు మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తి అయింది. అయితే దేశంలో మరోసారి లాక్ డౌన్ విధించేందుకు రష్యా విముఖత వ్యక్తం చేసింది.. 

 

Leave a Comment