ఒకే దేశం..ఒకే రేషన్ కార్డు : నిర్మలా సీతారామన్

ప్రధాన మంత్రి ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపనలో భాగంగా రెండో దశ ప్యాకేజీని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రకటించారు. ఇందులో వ్యవసాయం, వలస కూలీల సంక్షేమానికి పెద్దపీట వేశారు. దేశవ్యాప్తంగా యూనివర్సల్ రేషన్ కార్డు పథకాన్ని చేపడతామని ప్రకటించారు. ఈ పథకం కింద దేశంలో ఎక్కడి నుంచి అయిన రేషన్ తీసుకోవచ్చన్నారు. ఇప్పటికే ఈ పథకాన్ని 83 శాతం అమలు చేశామని, వచ్చే ఏడాది మార్చి నాటికి 100 శాతం అమలు చేస్తామని ఆమె చెప్పారు. 

పీఎం అవాస్ యోజన కింద అద్దె ఇంటి స్కీమ్ ను అమలు చేస్తామన్నారు. పట్టణ పేదలు, లేబర్ కార్మికులు తదితరులకు దీని వల్ల ప్రయోజనం కలుగుతుందన్నారు. ముద్ర పథకం కింద శిశు రుణాలు అందజేస్తామని, 50 వేల రుణాలు తీసుకునే వారు రెండు శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్నారు.  రైతుల కోసం ఉద్దేశించిన కిసాన్ క్రెడిట్ కార్డు మత్స్యకారులు మరియు పశుసంవర్ధక కార్మికులకు కూడా విస్తరించబడుతుందన్నారు. 

ప్యాకేజీ వివరాలు ఇలా ఉన్నాయి..

  • మార్చి, ఏప్రిల్ లో రైతులకు రూ.86,600 కోట్ల రుణాల ఆమోదం
  • చిన్నసన్నకారు రైతులకు రూ.4లక్షల కోట్ల రుణాల మంజూరు
  • 25 లక్షల మంది నూతన కిసాన్ కార్డు దారులకు రూ.25,000 కోట్ల రుణాలు
  • వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు రాష్ట్రాలకు రూ.6700 కోట్లు
  • నాబార్డు ద్వారా 29,500 గ్రామీణ బ్యాంకులకు నిధులు
  • రబీలో సన్నకారు, మధ్య తరహా రైతులకు రూ.30 వేల కోట్ల రుణాలు
  • వలస కార్మికుల ఉపాధికి రూ.10,000 కోట్లు
  • కనీస వేతనం రూ.182 నుంచి రూ.202కు పెంపు
  • గ్రామీణ మౌలిక వసతులకు రూ.4200 కోట్లు
  • ఎస్ఆర్డీఎఫ్ కింద రూ.11002 కోట్ల నిధులు
  • మార్చి 1 నుంచి మే 31 వరకు రుణాలు చెల్లించే రైతులకు వడ్డీ రాయితీ
  • వచ్చే రెండు నెలలు వలస కూటీలకు ఉచిత రేషన్
  • రేషన్ కార్డు లేని వారికి పది కిలోల బియ్యం, శనగలు
  • కార్మికులందరికీ కనీస వేతన హక్కు
  • యూనివర్సల్ రేషన్ కార్డుతో ఎక్కడైనా సరకులు తీసుకునే వెసులుబాటు

 

Leave a Comment